Share News

ODI World Cup: టీమిండియా ఓటమికి, ఆస్ట్రేలియా గెలవడానికి ఐపీఎలే కారణమా?

ABN , First Publish Date - 2023-11-24T18:27:54+05:30 IST

ODI World Cup: ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో భారత్‌లో భారత్‌ను ఓడించడం సామాన్య విషయం కాదని.. ఆస్ట్రేలియాకు ఐపీఎల్ కారణంగానే ఇది సాధ్యమైందని అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్, సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ODI World Cup: టీమిండియా ఓటమికి, ఆస్ట్రేలియా గెలవడానికి ఐపీఎలే కారణమా?

వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ ముందు వరకు ఓటమి ఎరుగని భారత్‌కు ఆస్ట్రేలియా తుదిపోరులో మాత్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అన్ని రంగాల్లో సమిష్టిగా రాణించి ఏకంగా ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఫైనల్లో టాస్ గెలిచిన వెంటనే ఎలాంటి బెరుకు లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. మ్యాచ్‌కు ముందు పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుందని ఆస్ట్రేలియాపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే భారత్‌లో భారత్‌ను ఓడించడం సామాన్య విషయం కాదని.. ఆస్ట్రేలియాకు ఐపీఎల్ కారణంగానే ఇది సాధ్యమైందని అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్, సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

సాధారణంగా అహ్మదాబాద్ పిచ్ ఎవరికీ అంతుబట్టకుండా ఉంటుందని.. ఎందుకంటే అక్కడి ఎర్రమట్టిపై పాతబడిన బంతి మోకాలి వరకు బౌన్స్ అయ్యేందుకు సహాయం చేస్తుందని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అశ్విన్ చెప్పాడు. దేశంలోని తూర్పు ప్రాంతం నుంచి తెచ్చిన మట్టితో అక్కడ పిచ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నాడు. దీంతో టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంటుందని ఊహించానని.. దేవుడి దయ వల్ల ఆస్ట్రేలియా మాత్రం టాస్ గెలవకూడదని అనుకున్నానని తెలిపాడు. కానీ ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడమే కాక టీమిండియాకు అద్భుతంగా బౌలింగ్ చేసిందని.. ఆస్ట్రేలియా ప్రదర్శన నిజంగా తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. నిజానికి ఆస్ట్రేలియా టీమ్‌లో చాలా మందికి ఐపీఎల్ ఆడిన అనుభవం ఉందని.. ఇక్కడి పిచ్‌లపై వాళ్లకు మంచి అవగాహన ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ప్రపంచకప్ ఫైనల్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా సెలక్టర్ జార్జి బెయిలీ, కెప్టెన్ కమిన్స్ పిచ్‌ను పరిశీలించి మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాడు. మొత్తంగా చూస్తే ఐపీఎల్ కారణంగా ఆస్ట్రేలియా వాళ్లు లాభపడితే.. టీమిండియా ఆటగాళ్లు మాత్రం పిచ్‌ను అర్ధం చేసుకోకుండా అతి విశ్వాసం చూపించడం మన కొంపముంచిందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. దాదాపుగా టీమిండియా అభిమానులు కూడా అశ్విన్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-24T18:29:50+05:30 IST