Share News

World Cup: ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చాలు సౌతాఫ్రికాకు పూనకాలే.. వరుసగా ఆరోసారి..

ABN , First Publish Date - 2023-10-22T08:11:27+05:30 IST

వన్డే క్రికెట్‌లో కొంత కాలంగా సౌతాఫ్రికా రెచ్చిపోతోంది. ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చాలు ఆ జట్టు బ్యాటర్లు పూనకాలు వచ్చినట్టుగా చెలరేగుతున్నారు. దీంతో ఆ జట్టు మొదట బ్యాటింగ్ చేసినప్పుడు వరుసగా 6 వన్డేల్లో 300కు పైగా పరుగులు సాధించడం విశేషం.

World Cup: ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చాలు సౌతాఫ్రికాకు పూనకాలే.. వరుసగా ఆరోసారి..

ముంబై: వన్డే క్రికెట్‌లో కొంత కాలంగా సౌతాఫ్రికా రెచ్చిపోతోంది. ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చాలు ఆ జట్టు బ్యాటర్లు పూనకాలు వచ్చినట్టుగా చెలరేగుతున్నారు. దీంతో ఆ జట్టు మొదట బ్యాటింగ్ చేసినప్పుడు వరుసగా 6 వన్డేల్లో 300కు పైగా పరుగులు సాధించడం విశేషం. అందులో రెండు సార్లు ఏకంగా 400కు పైగా పరుగులు సాధించడం గమనార్హం. సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసినప్పుడు గత 6 వన్డే మ్యాచ్‌ల స్కోర్లు ఒకసారి పరిశీలిస్తే.. ఆస్ట్రేలియాతో పోట్చెఫ్‌స్ట్రూమ్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో 338/6, సెంచూరియన్ వేదికగా జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో 416/5, జోహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌లో 315/9 పరుగులు సాధించింది. ఇక వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 428/5, లక్నో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 311/7, ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 399/7 పరుగులు సాధించింది. అలాగే 300కుపైగా స్కోర్లు సాధించిన ఆరుసార్లు ప్రత్యర్థిపై సౌతాఫ్రికా జట్టు 100 పరుగులకు పైగా తేడాతో విజయాలు సాధించడం విశేషం. దీంతో సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఏ స్థాయి ఫామ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు కూడా చెలరేగుతున్నారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఒక నెదర్లాండ్స్‌తో మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా అదరగొట్టింది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచిన సఫారీలు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్నారు. దీంతో ఆ జట్టు ప్రపంచకప్ హాట్ ఫెవరేట్‌గా మారిపోయింది.


ఇక శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విరుచుకుపడిన సౌతాఫ్రికా.. డిఫెండింగ్‌ చాంప్‌ ఇంగ్లండ్‌ నాకౌట్‌ అవకాశాలను గట్టిగా దెబ్బతీసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ హెన్రిచ్‌ క్లాసెన్‌ (67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109) ధనాధన్‌ శతకంతో.. వరల్డ్‌క్‌పలో శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. పరుగుల పరంగా వన్డేల్లో ఇంగ్లండ్‌కు ఇదే అత్యంత ఘోర ఓటమి. లీగ్‌ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు ఇది మూడో విజయం కాగా.. ఇంగ్లండ్‌కు మూడో పరాజయం. ఈ మ్యాచ్‌కు ముందు ఇరుజట్లూ పసికూనల చేతిలో కంగుతిన్నాయి. అఫ్థానిస్థాన్‌ చేతిలో ఇంగ్లండ్‌.. నెదర్లాండ్స్‌ చేతిలో సౌతాఫ్రికా ఓడాయి. కానీ, దక్షిణాఫ్రికా బలంగా పుంజుకోగా.. ఇంగ్లిష్‌ టీమ్‌ చెత్త బ్యాటింగ్‌తో కుదేలైంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొంది. బ్యాటర్లు చెలరేగడంతో.. తొలుత దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోరు చేసింది. రీస్‌ టాప్లీ 3 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్‌, ఆదిల్‌ రషీద్‌ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు. ఓపెనర్‌ డికాక్‌ (4) స్వల్ప స్కోరుకే వెనుదిగినా.. మరో ఓపెనర్‌ హెన్‌డ్రిక్స్‌ (85), డుస్సెన్‌ (60) రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. అయితే, వీరిద్దరినీ రషీద్‌ వెనక్కిపంపాడు. కెప్టెన్‌ మార్క్‌క్రమ్‌ (42)తోపాటు డేంజర్‌ బ్యాటర్‌ మిల్లర్‌ (5) కూడా టాప్లీ అవుట్‌ చేశాడు. ఈ దశలో దూకుడుగా ఆడిన క్లాసెన్‌, మార్కో జాన్సెన్‌ (75 నాటౌట్‌) ఆరో వికెట్‌కు 77 బంతుల్లో 151 పరుగులు జోడించడంతో.. టీమ్‌ స్కోరు 400 మార్క్‌కు చేరువైంది. సెంచరీ చేసిన క్లాసెన్‌ను అట్కిన్సన్‌ అవుట్‌ చేశాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేశారు. సఫారీ బౌలర్ల దెబ్బకు టాప్‌-7 బ్యాటర్లలో ఒక్కరు కూడా పట్టుమని 20 పరుగులు సాధించలేక పోయారు. దీంతో ఇంగ్లండ్‌ 22 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది. టాప్లీ గాయపడడంతో బ్యాటింగ్‌కు రాలేదు. బెయిర్‌స్టో (10), రూట్‌ (2), స్టోక్స్‌ (5), బట్లర్‌ (15) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఇంగ్లిష్‌ టీమ్‌ 100/8తో ఘోర పరాజయం అంచున నిలబడింది. అయితే, టెయిలెండర్లు అట్కిన్సన్‌ (35), మార్క్‌ ఉడ్‌ (43 నాటౌట్‌) తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించి పరువు దక్కించారు. కొట్జీ 3 వికెట్లు కూల్చగా.. ఎన్‌గిడి, జాన్సెన్‌ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు.

Updated Date - 2023-10-22T08:11:27+05:30 IST