Share News

IPL 2024: లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్‌గా సురేష్ రైనా?

ABN , Publish Date - Dec 24 , 2023 | 09:19 PM

Suresh Raina: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు లక్నో ఫ్రాంచైజీకి, సురేష్ రైనాకు మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టు సమాచారం.

IPL 2024: లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్‌గా సురేష్ రైనా?

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు లక్నో ఫ్రాంచైజీకి, సురేష్ రైనాకు మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టు సమాచారం. ఎక్స్‌లో ఓ జర్నలిస్ట్ పెట్టిన ట్వీట్‌కు రైనా ఇచ్చిన రిప్లేతో ఈ వార్తలకు మరింత బలం పెరిగింది. లక్నోసూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో సురేష్ రైనా ఒప్పందం కుదుర్చుకులేదని, అవన్నీ తప్పుడు వార్తలంటూ ఓ జర్నలిస్ట్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై స్పందించిన రైనా ఆ వార్తలు ఎందుకు నిజం కాకూడదు? అంటూ రాసుకొచ్చాడు. దీనిని బట్టి లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్‌గా సురేష్ రైనా ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్‌లో సురేష్ రైనాకు విశేషమైన అనుభవం ఉంది. మిస్టర్ ఐపీఎల్ అనే పేరు కూడా ఉంది. ఐపీఎల్ లెజెండ్‌లలో రైనా కూడా ఒకడు.


ఐపీఎల్‌లో రైనా చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2016, 2017 సీజన్‌లలో గుజరాత్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. కానీ ఫామ్ కోల్పోవడంతో 2022 మెగా వేలంలో రైనాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. దీంతో రిటైర్మెంట్ ప్రకటించి కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 37 ఏళ్ల రైనా లక్నోకు మెంటార్‌గా వ్యవహరించనున్నట్టు సమాచారం. తన ఐపీఎల్ కెరీర్‌లో 205 మ్యాచ్‌లాడిన రైనా 32 సగటుతో 5528 పరుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉంది. బౌలింగ్‌లో 25 వికెట్లు తీశాడు. కాగా గత రెండు సీజన్లలో లక్నోకు గౌతం గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ లక్నోతో కాంట్రాక్టు ముగియడంతో గంభీర్ ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటార్‌గా వెళ్లాడు.

Updated Date - Dec 24 , 2023 | 09:19 PM