Rohit Sharma: పాకిస్థాన్‌పై టీమిండియా కెప్టెన్ ప్రశంసలు.. ఇలా అయితే కష్టమేగా..?
ABN , First Publish Date - 2023-09-01T21:58:36+05:30 IST
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించేందుకు ఆ జట్టు ఎంతో కష్టపడిందని అభిప్రాయపడ్డాడు. కీలక మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థిని పొగడటంపై టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు.
మరికొద్దిగంటల్లో జరిగే దాయాదుల పోరు కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గురించి తాజాగా పల్లెకెలె వేదికగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతడు పాకిస్థాన్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. వన్డేల్లో పాకిస్థాన్ నంబర్‌వన్ జట్టు అని.. ఈ స్థాయికి రావడానికి ఆ జట్టు ఎంతగానో కష్టపడిందని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతోందని కితాబిచ్చాడు. ప్రస్తుతం బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్థాన్ టీమ్ ఫామ్‌లో ఉందని.. వాళ్లతో తమకు పోటీ నిజంగా సవాల్ వంటిదేనని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Cricket News: ప్రపంచకప్ జట్టులో ట్రాన్స్‌జెండర్.. చరిత్రలో ఇదే తొలిసారి
మరోవైపు ఆసియాకప్‌లో ఆరు మంచి జట్లు పోటీపడుతున్నాయని.. తమదైన రోజున ఎవరు ఎవరినైనా ఓడించగలరని రోహిత్ శర్మ అన్నాడు. పాకిస్థాన్, భారత్ మధ్య శత్రుత్వం గురించి అందరూ మాట్లాడుకుంటారని.. అయితే జట్టుగా తమ దృక్పథం మరోలా ఉంటుందని స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌ను తాము శత్రుదేశంలా కాకుండా కేవలం ప్రత్యర్థిగానే భావిస్తామని రోహిత్ తెలిపాడు. వన్డే ఫార్మాట్‌కు తగ్గట్లుగా తాము ఆడాల్సి ఉంటుందని.. అయితే అదే సమయంలో పరిస్థితులకు అనుగుణంగా ఆడటం కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్ తమకు ఫిట్‌నెస్ టెస్ట్ వంటిది కాదని.. ఇది చాలా పెద్ద టోర్నీ అన్నాడు. ఆసియా కప్‌కు తాము అన్నివిధాలుగా సిద్ధమయ్యే వచ్చామని.. తుది జట్టు ఎంపికలో ఎవరిని తీసుకోవాలనే తలనొప్పి ఉండటం తమకు మేలు చేసే అంశమేనని పేర్కొన్నాడు. సత్తా కలిగిన ఆటగాళ్లు జట్టులో ఉండటం కలిసొచ్చేదేనన్నాడు. కాగా కీలక మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థిని రోహిత్ పొగడటంపై టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇలాగైతే గెలవడం కష్టమేగా అని సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.