Ravichandran Ashwin: ఇలాంటి బౌలర్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో పక్కనపెడతారా?

ABN , First Publish Date - 2023-07-13T15:15:11+05:30 IST

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అశ్విన్ బౌలింగ్ చూసిన తర్వాత రోహిత్ తీసుకున్న నిర్ణయం చాలా తప్పు అని అతడిని నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి బౌలర్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడనివ్వకుండా పిచ్ అంటూ సాకులు, కాకమ్మ కబుర్లు చెప్పడంపై మండిపడుతున్నారు. కీలకమైన మ్యాచ్‌లో అశ్విన్‌ను ఆడించకపోవడం సరికాదని విమర్శిస్తున్నారు.

Ravichandran Ashwin: ఇలాంటి బౌలర్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో పక్కనపెడతారా?

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అగ్రశ్రేణి బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసి తన సత్తా చాటుకున్నాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మపై సోషల్ మీడియాలో నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బౌలర్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడనివ్వకుండా పిచ్ అంటూ సాకులు, కాకమ్మ కబుర్లు చెప్పడంపై మండిపడుతున్నారు.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 సైకిల్‌లో భాగంగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌లో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. బుధవారం నుంచి ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసింది. ముఖ్యంగా సీనియర్ బౌలర్ అశ్విన్ విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్ చూసి మాజీ క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోయారు. అటు ఫ్యాన్స్ కూడా షాకైపోయారు. అశ్విన్ ఇంత సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నాడేంటని చర్చించుకున్నారు. అంతలా వెస్టిండీస్‌ పిచ్‌పై అశ్విన్ ప్రభావం చూపించాడు.

ఇది కూడా చదవండి: IND vs WI: అశ్విన్ ఖాతాలో 6 రికార్డులు.. మొదటి రోజు ఆటను శాసించిన ఆఫ్‌ స్పిన్నర్

సాధారణంగా స్వదేశీ పిచ్‌లపై అశ్విన్ చెలరేగి బౌలింగ్ చేస్తాడు. విదేశాల్లో ఎక్కువ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి. దీంతో అశ్విన్, జడేజాలలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలో తెలియక జట్టు యాజమాన్యం తలలు పట్టుకుంటుంది. అయితే ఐపీఎల్‌లో తన బౌలింగ్‌లో వాడి వేడిని చూపించిన అశ్విన్‌ను ఇంగ్లండ్‌ గడ్డపై జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడించాలని పలువురు మాజీలు సూచించారు. కానీ కెప్టెన్ రోహిత్ జడేజా వైపు మొగ్గు చూపించి పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందన్న నమ్మకంతో అశ్విన్ లాంటి టాప్ బౌలర్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. అదే సమయంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ లయోన్ మాత్రం రాణించాడు. ఈ టెస్టులో భారత్ 209 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. దీంతో అశ్విన్‌ను తీసుకుంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు.

తాజాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అశ్విన్ బౌలింగ్ చూసిన తర్వాత రోహిత్ తీసుకున్న నిర్ణయం చాలా తప్పు అని అతడిని నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. కీలకమైన మ్యాచ్‌లో అశ్విన్‌ను ఆడించకపోవడం సరికాదని విమర్శిస్తున్నారు. కాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టులో 24.3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 60 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో అశ్విన్ బౌలింగ్‌పై మాజీ క్రికెటర్లు, ప్రముఖ కామెంటేటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వెస్టిండీస్‌తో సిరీస్ కోసం అశ్విన్ చక్కగా సన్నద్ధం అయ్యాడని.. అతడు ఎక్కువ వేరియషన్‌లకు పోకుండా సంప్రదాయ డెలివరీలకు కట్టుబడి బౌలింగ్ చేశాడని కొనియాడుతున్నారు.

Updated Date - 2023-07-13T15:17:50+05:30 IST