Asian Games 2023: వర్షం వల్ల ఫైనల్ రద్దు.. అయినా టీమిండియాకు గోల్డ్ మెడల్
ABN , First Publish Date - 2023-10-07T15:32:35+05:30 IST
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. భారత్ పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్ గోల్డ్ మెడల్ గెలిచింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. భారత్ పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్ గోల్డ్ మెడల్ గెలిచింది. సీడింగ్ ప్రకారం భారత్ ర్యాంక్ ఎక్కువగా ఉండటం వల్ల గోల్డ్ మెడల్ భారత్ కైవసం చేసుకుంది. ఇక ఆప్ఘనిస్తాన్ ఖాతాలో వెండి పతకం చేరింది. కాంస్య పతకం కోసం పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన పోరులో బంగ్లాదేశ్ గెలిచింది. దీంతో బంగ్లాదేశ్ కాంస్యం సాధించింది.
ఇది కూడా చదవండి: World cup: టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు.. నిన్న గిల్.. నేడు హార్దిక్
కాగా వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఆప్ఘనిస్థాన్ జట్టు 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆప్ఘనిస్థాన్ జట్టు 12 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయింది. భారత పేసర్లు శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్ ధాటికి ఆప్ఘనిస్థాన్ ఓపెనర్లు జుబైద్ అక్బరీ(5), మహ్మద్ షాజాద్(4) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఆ వెంటనే నూర్ అలీ జద్రాన్(1) రనౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్ ఆప్ఘనిస్థాన్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 10వ ఓవర్లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ విడదీశాడు. అఫ్సర్ జజాయ్(15)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కరీం జనత్(1)ను మరో స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆప్ఘనిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ఆప్ఘనిస్థాన్‌ను కెప్టెన్ గుల్బాదిన్ నాయబ్‌తో కలిసి షాహిదుల్లా కమల్ ఆదుకున్నాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది.