Team India: ప్రపంచకప్ ముంగిట ఆందోళన.. టీమిండియాకు వైరల్ ఫీవర్ గండం
ABN , First Publish Date - 2023-09-29T15:30:15+05:30 IST
ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ ముందు టీమిండియా జట్టులో చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడటంతో ప్రిపరేషన్స్‌కు అడ్డంకిగా మారింది. దీంతో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. అయితే మెగా టోర్నీకి ముందే టీమిండియా ఇబ్బందులు పడుతోంది. జట్టులో చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడటంతో ప్రిపరేషన్స్‌కు అడ్డంకిగా మారింది. దీంతో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైరల్ ఫీవర్ కారణంగా ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు పలువురు కీలక ఆటగాళ్లు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగా టోర్నీలోనూ అలాంటి పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Team India: ట్రోఫీ తీసుకోని కెప్టెన్ రోహిత్ శర్మ.. అసలు కారణం ఇదే..!!
మరోవైపు టీమిండియా త్వరలో రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. గౌహతి వేదికగా శనివారం నాడు ఇంగ్లండ్‌తో, అక్టోబర్ 3న తిరువనంతపురం వేదికగా నెదర్లాండ్స్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్‌లలో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లకు మొత్తం 15 మంది సభ్యులు అందుబాటులో ఉంటారని కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటున్నాడు. ప్రపంచకప్‌కు ముందు ప్రతి ఆటగాడికి తగినంత విశ్రాంతి దొరికిందని.. ఈ విషయంలో మాత్రం తను చాలా హ్యాపీ అని పేర్కొన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లకు ఆస్ట్రేలియాతో గేమ్ టైం దొరికిందని, ఇది చాలా కీలకమైన అంశమని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. బుమ్రాకు గేమ్ టైం దక్కిందని.. చివరి మ్యాచుల్లో తన కోటా 10 ఓవర్లు అతను పూర్తి చేశాడని గుర్తుచేశాడు. అటు మహ్మద్ సిరాజ్ కూడా అనారోగ్యం నుంచి తిరిగొచ్చి బాగానే బౌలింగ్ చేశాడన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో అశ్విన్ కూడా చక్కగా ఆడాడని ద్రవిడ్ కొనియాడాడు.