Team India: తొలి ఐదు అలా.. మలి ఐదు ఇలా.. మరి ఫైనల్ ఎలా?
ABN , First Publish Date - 2023-11-17T16:27:05+05:30 IST
ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి లేకుండా సాగుతోంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడగా తొలి ఐదు ఒకలా.. మలి ఐదు మరోలా భారత్ విజయం సాధించింది. తొలి ఐదు మ్యాచ్‌లలో టీమిండియా సెకండ్ బ్యాటింగ్ చేసి గెలవగా.. చివరి ఐదు మ్యాచ్‌లలో ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి లేకుండా సాగుతోంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడగా తొలి ఐదు ఒకలా.. మలి ఐదు మరోలా భారత్ విజయం సాధించింది. తొలి ఐదు మ్యాచ్‌లలో టీమిండియా సెకండ్ బ్యాటింగ్ చేసి గెలవగా.. చివరి ఐదు మ్యాచ్‌లలో ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది. తొలుత చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (46) అత్యధిక స్కోరర్. 200 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 41.2 ఓవర్లలో ఛేజింగ్ చేసింది. రెండో మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌పై 273 పరుగుల లక్ష్యాన్ని 35 ఓవర్లలో ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఇక మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 192 పరుగుల టార్గెట్‌ను 30.3 ఓవర్లలో ఛేదించడంతో 7 వికెట్ల తేడాతో గెలిచింది. నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 257 పరుగుల టార్గెట్‌ను 41.3 ఓవర్లలో అందుకుని 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 274 పరుగుల టార్గెట్‌ను 48 ఓవర్లలో ఛేదించి 4 వికెట్ల తేడాతో గెలుపు కైవసం చేసుకుంది.
ఆరో మ్యాచ్ నుంచి పదో మ్యాచ్ వరకు టీమిండియా వరుసగా తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ను 129 పరుగులకే ఆలౌట్ చేయడంతో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఏడో మ్యాచ్‌లో శ్రీలంకపై తొలుత బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. తర్వాత శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసి 302 పరుగుల భారీ గెలుపు సాధించింది. 8వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై తొలుత బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. తర్వాత దక్షిణాఫ్రికాను 83 పరుగులకే ఆలౌట్ చేయడంతో 70 పరుగుల తేడాతో గెలుపు కైవసం చేసుకుంది. 9వ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై తొలుత బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. తర్వాత నెదర్లాండ్స్‌ను 250 పరుగులకు ఆలౌట్ చేయడంతో 160 రన్స్ తేడాతో గెలిచింది. 10వ మ్యాచ్‌లో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. తర్వాత న్యూజిలాండ్‌ను 327 పరుగులకు ఆలౌట్ చేయడంతో 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు కీలకమైన ఫైనల్లో టీమిండియా ఏం చేస్తుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.