Virat Kohli: సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ
ABN , First Publish Date - 2023-01-09T18:48:40+05:30 IST
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వన్డే రికార్డుల్లో ఒకదానిపై మాజీ సారథి
న్యూఢిల్లీ: టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వన్డే రికార్డుల్లో ఒకదానిపై మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) కన్నేశాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వన్డే సిరీస్‌లో తిరిగి బ్యాట్ పట్టబోతున్నారు. దాదాపు నాలుగేళ్లపాటు పరుగులు చేయలేక అష్టకష్టాలు పడిన కోహ్లీ గతేడాది నవంబరు-డిసెంబరులో బంగ్లాదేశ్ (Bangladesh)తో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ చేసి పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. అయితే, ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం మళ్లీ పరుగుల వేటలో విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో 45 పరుగులు మాత్రమే చేశాడు.
సచిన్ టెండూల్కర్ స్వదేశంలో 164 మ్యాచుల్లో 20 వన్డే సెంచరీలు నమోదు చేశాడు. కోహ్లీ ఇప్పటి వరకు 101 మ్యాచుల్లో 19 సెంచరీలు సాధించాడు. అయితే, స్వదేశంలో కోహ్లీ చివరిసారి మార్చి 2019లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు సెంచరీలు లేక ముఖం వాచిపోయాడు. ఇప్పుడు శ్రీలంకతో సిరీస్‌లో ఒక్క సెంచరీ సాధించినా సచిన్ సరసన చేరుతాడు. ఇక స్వదేశంలో ఎక్కువ సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో సచిన్, కోహ్లీ తర్వాతి స్థానంలో హషీమ్ ఆమ్లా (14), రికీ పాంటింగ్ (13), రాస్ టేలర్ (12) ఉన్నారు.
శ్రీలంకపై అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును కోహ్లీ ఇప్పటికే సమం చేశాడు. శ్రీలంకపై కోహ్లీ 47 మ్యాచుల్లో 8 సెంచరీలతో 2220 పరుగులు చేయగా, సచిన్ టెండూల్కర్ 84 మ్యాచుల్లో 8 సెంచరీలు సాధించాడు. అయితే, 3113 పరుగులతో ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
అలాగే, మరో రికార్డుపైనా కోహ్లీ కన్నేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ ప్రస్తుతం 12471 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ 18,426 (463 వన్డేలు)తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కుమార సంగక్కర 14,234 (404 వన్డేలు), రికీ పాంటింగ్ 13,704 (375 వన్డేలు), సనత్ జయసూర్య 13,430 (445 వన్డేలు), మహేల జయవర్దనె 12,650 (448 వన్డేలు) పరుగులతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐదో స్థానంలో ఉన్న జయవర్ధనెను కోహ్లీ వెనక్కి నెట్టేయాలంటే మరో 181 పరుగులు అవసరం. శ్రీలంకతో సిరీస్‌లో ఆ రికార్డు బద్దలు గొట్టాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు.