Virat Kohli: కోహ్లీకి ఆ వంటకమంటే మా చెడ్డ చిరాకట!.. ఒకసారి ఏకంగా..
ABN , First Publish Date - 2023-02-20T17:48:37+05:30 IST
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆహార ప్రియుడు. ఒకప్పుడు మాంసాహారంపై మక్కువ చూపే
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆహార ప్రియుడు. ఒకప్పుడు మాంసాహారంపై మక్కువ చూపే కోహ్లీ ఇప్పుడు మాత్రం వేగాన్‌గా మారిపోయాడు. ఫిట్‌నెస్‌ను పెంచే ఆహార పదార్థాలనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు. జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉంటాడు. ‘చోలో కుల్చే’ (Cholle Kulche) అనేది కోహ్లీ ఫేవరెట్ డిష్‌లలో ఒకటి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టు ముగిసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా కోహ్లీ అభిమానులతో ముచ్చటించాడు. ‘ఆస్క్ మి ఎనీథింగ్’ అంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చాడు. ఈ సందర్భంగా తాను తినని, భవిష్యత్తులో అసలు రుచి కూడా చూడాలని అనుకోని ఓ కూర గురించి చెప్పుకొచ్చాడు.
ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో నిర్వహించిన ఈ సెషన్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. తానిప్పుడు శాకాహారినని చెప్పాడు. కాకరకాయ(Bitter Gourd)ను తాను ఎప్పుడూ తినబోనని తేల్చి చెప్పాడు. అలాగే, తాను ఒకసారి తిన్న అత్యంత చెత్త వంటకం గురించి కూడా అభిమానులతో పంచుకున్నాడు. తాను మలేసియా వెళ్లినప్పుడు పురుగులతో చేసిన వంటకాన్ని రుచి చూశానన్నాడు. అదేంటో తనకు తెలియదు కానీ ఫ్రై చేశారని, అది తిన్నాక అసహ్యమేసిందన్నాడు. తాను అత్యంత ఇష్టపడే ‘చీట్ మీల్’ ‘చోటే బాతుర్’ అని చెప్పుకొచ్చాడు.
అలాగే, తాను చేసిన అతిపెద్ద ఫ్యాషన్ మిస్టేక్ గురించి కూడా కోహ్లీ అభిమానులకు చెప్పేశాడు. అప్పట్లో తాను హీల్ ఉండే షూస్ వేసుకునేవాడనని, కానీ ఇప్పుడు వాటిని వేసుకోవడాన్ని ఊహించుకోలేనని అన్నాడు. అప్పట్లో కొన్ని రోజులు ప్రింటెడ్ షర్టులు కూడా వేసుకున్నానని గుర్తు చేసుకున్నాడు. పై నుంచి కింది వరకు డ్రెస్ చేసుకోవడం సౌకర్యంగా అనిపించలేదన్నాడు.
అభిమానులతో కోహ్లీ ముచ్చటించిన ఈ వీడియో సోషల్ మీడియాను దున్నేసింది. మూడు మిలియన్లకుపైగా వ్యూస్, దాదాపు 7 లక్షల లైకులు వచ్చిపడ్డాయి. ఈ వీడియోపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తనకు కూడా కాకరకాయంటే మహా చిరాకని ఒకరంటే, చీట్ మీల్ అంటే ఏంటో ప్రపంచంలోని అందరికీ తెలిసిందేనని మరో యూజర్ కామెంట్ చేశారు.