Cricket News: బంగ్లాదేశ్ జట్టులో రచ్చ.. ఇద్దరు ప్రధాన ఆటగాళ్ల మధ్య విభేదాలు
ABN , First Publish Date - 2023-09-29T21:14:11+05:30 IST
ప్రపంచకప్ జట్టు ఎంపిక విషయానికి సంబంధించి వెటరన్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్, కెప్టెన్ షకీబల్ హసన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ ముందు ఇలాంటి గొడవలు బంగ్లాదేశ్ జట్టుకు మంచిది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవైపు వన్డే ప్రపంచకప్‌కు అన్ని జట్లు సమాయత్తం అవుతున్న వేళ బంగ్లాదేశ్ జట్టులో రచ్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతుండటంతో ఆ జట్టులో ఏమవుతుందో అర్ధం కాక అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వెటరన్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్, కెప్టెన్ షకీబల్ హసన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రపంచకప్ జట్టు ఎంపిక విషయానికి సంబంధించి వీళ్లిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వాస్తవానికి తమీమ్ ఇక్బాల్ ఆసియా కప్‌కు ముందు కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికి అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ కొన్నిరోజులకు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో ఆసియా కప్ ఆడకపోయినా వరల్డ్ కప్‌లో తమీమ్ ఇక్బాల్ ఆడతాడని అందరూ భావించారు.
కానీ ప్రపంచకప్‌లో తాను నాలుగైదు మ్యాచ్‌లు మాత్రమే ఆడతానని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తమీమ్ ఇక్బాల్ చెప్పాడు. దీంతో అతడిని ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవడం దండగ అని కెప్టెన్ షకీబుల్ హసన్ భావించాడు. ఈ నేపథ్యంలో అసలు టీంలో తమీమ్ అక్కర్లేదని బోర్డుకు షకీబ్ చెప్పాడు. దీంతో ప్రపంచకప్ జట్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఈ పరిణామంతో తమీమ్ ఇక్బాల్ షాక్ తిన్నాడు. తమీమ్ ఇక్బాల్‌కు వరల్డ్ కప్ టీమ్‌లో చోటు ఇస్తే తాను టోర్నీ నుంచి తప్పుకుంటానని షకీబుల్ హసన్ బంగ్లాదేశ్ బోర్డును బెదిరించినట్టు ఆరోపణలు కూడా వినిపించాయి.
ఇది కూడా చదవండి: Team India: ప్రపంచకప్ ముంగిట ఆందోళన.. టీమిండియాకు వైరల్ ఫీవర్ గండం
అయితే దీనిపై తమీమ్‌ను జర్నలిస్టులు వివరణ అడగ్గా.. తాను కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడతానని చెప్పలేదని.. బోర్డు అధికారులు తనను మిడిలార్డర్‌లో ఆడమని చెప్పారని.. తాను మిడిలార్డర్‌లో ఆడలేనని చెప్పినట్లు వివరించాడు. ఈ అంశంపై షకీబ్ కూడా స్పందించాడు. ఇదో చిన్నపిల్లల గొడవలా ఉందని.. జట్టు కోసం ఆలోచించకుండా వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆలోచించబట్టే మిడిలార్డర్‌లో ఆడలేనంటూ వ్యాఖ్యలు చేయడం సబబు కాదని పేర్కొన్నాడు. టీంకు ఏం కావాలో అది చేయాలి కానీ, తనకు ఇష్టం వచ్చినట్లే అంతా జరగాలని అనడం కరెక్ట్ కాదన్నాడు. రోహిత్ కూడా నంబర్ 7 పొజిషన్ నుంచి బ్యాటింగ్ ప్రారంభించి ఓపెనర్ స్థానం వరకు వెళ్లాడని షకీబ్ గుర్తుచేశాడు. అంతేకాకుండా తమీమ్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని.. ఇంకా ఆ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదన్నాడు. ఈ క్రమంలో ఇలాంటి అన్‌ఫిట్ ప్లేయర్‌ను తాను ప్రపంచకప్ వరకు మోసుకెళ్లలేనని షకీబుల్ హసన్ తేల్చిచెప్పాడు. 'అన్‌ఫిట్‌గా ప్లేయర్‌ను ఆడించడం అంటే దేశాన్ని, జట్టును మోసం చేయడమే' అని గతంలో ధోనీ చెప్పాడని.. తాను కూడా ఇలాంటి పని చేయబోనని స్పష్టం చేశాడు. కాగా షకీబ్, తమీమ్ మధ్య జరుగుతున్నదంతా పెద్ద డ్రామాలా ఉందని, వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ ముందు ఇలాంటి గొడవలు బంగ్లాదేశ్ జట్టుకు మంచిది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.