Share News

ODI World Cup: పాకిస్థాన్‌కు వసీం అక్రమ్ సూపర్ చిట్కా.. అలా చేస్తే సెమీస్‌కు వెళ్తారని సలహా

ABN , First Publish Date - 2023-11-10T15:11:40+05:30 IST

Pakistan Team: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆటతీరుపై వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి జట్టును తానెప్పుడూ చూడలేదని మండిపడ్డాడు. జట్టు వైఖరి మారాలని.. ఇప్పటికైనా ఆటతీరు మెరుగుపర్చాలని అక్రమ్ సూచించాడు. అయితే పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు వెళ్లాలంటే ఆ జట్టు మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ సూపర్ చిట్కా చెప్పాడు.

ODI World Cup: పాకిస్థాన్‌కు వసీం అక్రమ్ సూపర్ చిట్కా.. అలా చేస్తే సెమీస్‌కు వెళ్తారని సలహా

వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు దాదాపు ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో పాటు న్యూజిలాండ్ సెమీస్‌లో తలపడటం గ్యారంటీగా కనిపిస్తోంది. సాంకేతికంగా పాకిస్థాన్ రేసులో ఉన్నా ఆ జట్టుకు అవకాశం లేదనే చెప్పాలి. అయితే పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు వెళ్లాలంటే ఆ జట్టు మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ సూపర్ చిట్కా చెప్పాడు. ఇటీవల శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్‌ను దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్ జట్టు కూడా ఇంగ్లండ్ జట్టు మొత్తాన్ని ఒకేసారి అవుట్ చేస్తే సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పాడు. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని.. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండగా పాకిస్థాన్ జట్టు ఆ గదికి తాళం వేస్తే ఇంగ్లండ్ ఆటగాళ్లు అందరూ సామూహికంగా టైమ్డ్ అవుట్ అవుతారంటూ వసీమ్ అక్రమ్ ఛమత్కరించాడు.

కాగా ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆటతీరుపై వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి జట్టును తానెప్పుడూ చూడలేదని మండిపడ్డాడు. జట్టు వైఖరి మారాలని.. ఇప్పటికైనా ఆటతీరు మెరుగుపర్చాలని అక్రమ్ సూచించాడు. కాగా పాకిస్థాన్ జట్టు లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌ను శనివారం ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా పాకిస్థాన్ గెలవాలి. అంతేకాకుండా భారీ తేడాతో గెలిచి నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలి. తొలుత పాకిస్తాన్ బ్యాటింగ్‌ చేసినట్లయితే 300కు పైగా పరుగులు చేయాలి. అనంతరం ఇంగ్లండ్‌ను 13 పరుగులకే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి 300 పరుగులు చేస్తే.. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ ఆరు ఓవర్లలోనే ఛేదించాలి. ఇది సాధ్యమయ్యే పని కాదని.. పాకిస్థాన్ ఇక ఆశలు వదులుకోవడమే మంచిదని అభిమానులు సూచిస్తున్నారు. మాజీ క్రికెటర్లు కూడా సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడటం పక్కా అని స్పష్టం చేస్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-10T15:11:41+05:30 IST