Delhi Test: ఇండియా గెలిచింది సరే.. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఏం చేయాలి?
ABN , First Publish Date - 2023-02-19T16:48:48+05:30 IST
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు(Delhi Test)లో రోహిత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు(Team India) ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్(WTC) ఫైనల్ దిశగా మరో ముందడుగు వేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు(Delhi Test)లో రోహిత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగు మ్యాచ్‌లో టెస్టు సిరీస్‌లో 2-0తో ముందంజ వేసింది.
2021-23 సైకిల్‌లో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు పదో విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా తన పాయింట్ల శాతాన్ని 61.66 నుంచి 64.06కు పెంచుకుంది. మరోవైపు, ఓడిన ఆస్ట్రేలియా పాయింట్ పర్సంటేజ్ 70.83 నుంచి 66.67 శాతానికి పడిపోయింది.
ఆస్ట్రేలియాతో ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వీటిలో ఒకదాంట్లో విజయం సాధిస్తే రోహిత్ సేన(Rohit Team) ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ గెలుపుతో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక(Sri Lanka) నుంచి భారత్‌కు ముప్పు తప్పినట్టు అయింది. ప్రస్తుతం శ్రీలంక 53.33 పాయింట్ పర్సంటేజ్‌తో ఉంది. మార్చిలో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో విజయం సాధిస్తే మాత్రం ఆ జట్టు పాయింట్ల శాతం 60 దాటుతుంది.
ఒకవేళ ఈ సిరీస్‌ను భారత్ 3-1తో సొంతం చేసుకుంటే 61.92 శాతంతో ముగించి ఆస్ట్రేలియాతో కలిసి ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ 2-2తో సిరీస్ డ్రా అయినా నాలుగో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కంటే మెరుగైన స్థితిలోనే ఉంటుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో శ్రీలంక ఓటమి పాలైతే భారత్ ఫైనల్ ఆశలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఒకవేళ ఇండియా 3-0తో కానీ, 4-0తో కానీ సిరీస్‌ను ముగిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంది. అప్పుడు రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా-శ్రీలంక పోటీపడతాయి.