టెస్టులంటే బోరింగ్ కాదు.. మజా మజా

ABN , First Publish Date - 2023-03-13T16:59:19+05:30 IST

లక్ష్యం 285 పరుగులు.. నాలుగో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 28 పరుగులు.. చివరి రోజు గెలవాలంటే 257 పరుగులు కావాలి.

టెస్టులంటే బోరింగ్ కాదు.. మజా మజా

క్రైస్ట్‌చర్చ్: లక్ష్యం 285 పరుగులు.. నాలుగో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 28 పరుగులు.. చివరి రోజు గెలవాలంటే 257 పరుగులు కావాలి. కానీ.. ఉదయం వర్షం కారణంగా ఆట రెండు గంటల ఆలస్యమైంది.. మరో 18 ఓవర్లు గడిచాయో లేదో ఇంకో రెండు వికెట్లు కోల్పోయింది. అప్పటికి స్కోరు 90 పరుగులే. గెలుపుపై ఆశలు సన్నగిల్లాయి. అలాంటి స్థితి నుంచి అద్భుతం చేసింది న్యూజిలాండ్(New Zealand). ఆఖరి బంతికి పరుగు తీసి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండో టెస్టులోనూ ఉత్కంఠభరిత గెలుపు అందుకోవడం ఇందులో విశిష్టత.

గెలిచి మనకు గెలుపునిచ్చింది

శ్రీలంక (Sri Lanka)తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్రైస్ చర్చ్ లో ఈ నెల 9న మొదలైన ఈ మ్యాచ్ పలు నాటకీయ మలుపుల వద్ద ముగిసింది. ఆతిథ్య కివీస్ కు దీటుగా ఉపఖండ జట్టు శ్రీలంక పోరాటమే దీనికి కారణం. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 355 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (87) టాప్ స్కోరర్. కెప్టెన్ కరుణ రత్నె (50), మాజీ కెప్టెన్ మాథ్యూస్ (47), చండీమాల్ (39), ఆల్ రౌంర్ ధనంజయ డిసిల్వా (46) తలో చేయి

వేశారు. ప్రతిగా న్యూజిలాండ్ 373 పరుగులు చేసింది. ఓపెనర్లు లాథమ్ (67), కాన్వే (30) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ డారిల్ మిచెల్ (102) సెంచరీతో ఆదుకోగా.. చివర్లో పేసర్ మాట్ హెన్రీ (72) రెచ్చిపోయాడు. దీంతో అనూహ్యంగా కివీస్ కు 18 పరుగుల ఆధిక్యం దక్కింది.

రెండో ఇన్నింగ్స్ లోనూ పోటాపోటీ

స్వల్ప ఆధిక్యాన్ని కోల్పోయిన లంక రెండో ఇన్నింగ్స్ లోనూ మెరుగ్గా ఆడింది. మాథ్యూస్ (115) అద్భుత సెంచరీకి చండీమాల్ (42), ధనంజయ డిసిల్వా (47) అండగా నిలిచారు. ఆ జట్టు 302 పరుగులకు ఆలౌటై కివీస్ కు 285 పరుగుల లక్ష్యం

నిర్దేశించింది. కానీ, సోమవారం ఉదయం వర్షం పడడంతో రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది. కాన్వే (5) వంటి కీలక బ్యాట్స్ మన్ వికెట్ ను ముందు రోజే పోగొట్టుకుని.. 50 పరుగుల వద్ద లాథమ్ (24) కూడా పెవిలియన్ చేరిన పరిస్థితుల్లో న్యూజిలాండ్ విజయంపై ఆశలు సన్నగిల్లాయి. అయితే, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో అతడు మలిలో ఇతడు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిన మిచెల్ (81, 3 ఫోర్లు, 4 సిక్సులు) రెండో ఇన్నింగ్స్ లో విలియమ్సన్ కు అండగా నిలిచాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 142 పరుగులు జోడించడంతో ఓ దశలో కివీస్ 232/4తో నిలిచింది. ఇక్కడే మిచెల్ ను ఔట్ చేసి మ్యాచ్ ను లంక మలుపు తిప్పింది. బ్లండెల్ (3), బ్రాస్ వెల్ (10), సౌథీ (1) ఇలా ఒకరి వెంట ఒకరిని లంక బౌలర్లు పెవిలియన్ చేర్చారు.

చివరి రోజు.. చివరి ఓవర్.. ఏడు పరుగులు

లంక బౌలర్లు వడివడిగా వికెట్లు తీసిన క్రమంలో.. చివరి ఓవర్ లో కివీస్ విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సెంచరీ వీరుడు విలియమ్సన్ ఉన్నా.. గెలుపుపై ఏ మూలనో సందేహం. తొలి రెండు బంతులకు సింగిల్స్ వచ్చినా.. మూడో బంతికి హెన్రీ (4 రనౌట్) అనూహ్యంగా రనౌటయ్యాడు. కానీ, విలియమ్సన్ నాలుగో బంతిని ఫోర్ కొట్ట్టి స్కోర్లను సమం చేశాడు. ఇక ఐదో బంతికి పరుగు రాలేదు. ఆరో బంతికి బైస్ రావడంతో న్యూజిలాండ్ గెలిచింది. అక్కడా ఉత్కంఠ.. చివరి బంతికి బైస్ రూపంలో పరుగు వచ్చినా.. విలియమ్సన్ రనౌట్ అయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. బంతి బ్యాట్ కు తగలకున్నా పరుగు తీసిన కేన్.. సకాలంలో క్రీజులోకి చేరుకున్నాడు. ఆ వెంటనే సెకన్ల తేడాలో బంతి వికెట్లకు తగలడం గమనార్హం. కాగా, పది రోజుల కిందట ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో కివీస్ ఇలానే చివరి క్షణాల్లో ఉత్కంఠభరిత విజయం అందుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో టెస్టులోనూ ఒత్తిడిని అధిగమిస్తూ గెలవడం అంటే విశేషమే.

చిరకాల స్నేహితుల సెంచరీ

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ విలియమ్సన్, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి అండర్ 19 స్థాయి నుంచి వచ్చారు. 2008 అండర్ 19 ప్రపంచ కప్ లో కలిసి ఆడారు. అప్పటినుంచి వీరు మంచి స్నేహితులు. ఇద్దరూ అటుఇటుగా టెస్టు సెంచరీల సంఖ్యలో సమంగా ఉన్నారు. కోహ్లి ఆసీస్ తో నాలుగో టెస్టులో తన 28వ శతకం చేయగా.. విలియమ్సన్ కు లంకపై చేసిన సెంచరీ కెరీర్ లో 27వది. కాగా, ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది.

68.52 శాతంతో ఆసీస్‌, భారత్ 60.29 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్‌పై సిరీస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా 55.56 శాతంతో మూడో స్థానంలోకి వచ్చింది. న్యూజిలాండ్ మీద ఓడిన లంక 48.48 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. భారత్ - ఆసీస్‌ నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. కానీ, ఈ స్థానాల్లో మార్పు ఉండకపోవచ్చు. శాతాలు మాత్రం మారుతాయి.

Updated Date - 2023-03-13T19:33:14+05:30 IST