Womens Premier League: బోణీ కొట్టిన ఢిల్లీ.. బెంగళూరుపై ఘన విజయం
ABN , First Publish Date - 2023-03-05T19:03:28+05:30 IST
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో భాగంగా రాయల్ చాలెంజర్స్(RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో భాగంగా రాయల్ చాలెంజర్స్(RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్(DC) 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత మెగ్‌లానింగ్(72), షెఫాలీ వర్మ(84) చెలరేగడంతో తొలుతు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 224 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్ తారా నోరిస్ బంతితో చెడుగుడు ఆడేసింది. 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసి బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించింది. ఫలితంగా ఆర్సీబీ వికెట్లు పేకమేడను తలపించాయి. అలీస్ కాప్సీ రెండు వికెట్లు తీసుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన చేసిన 35 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఎల్లీస్ పెర్రీ 31, మేగన్ షట్ 30(నాటౌట్) పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు.
ఇక, తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి మెగ్ లానింగ్(Meg Lanning), షెఫాలీ వర్మ(Shafali Verma) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి ఆర్సీబీ బౌలింగును చీల్చి చెండాడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు భారీ స్కోరు సాధించింది. లానింగ్ 43 బంతుల్లో 14 ఫోర్లతో 72 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది.