Rohit Sharma: నన్ను అలాంటి ప్రశ్నలు అడగొద్దు.. మీడియాపై రోహిత్ శర్మ అసహనం!
ABN , First Publish Date - 2023-09-05T16:22:43+05:30 IST
బయటి వారు ఏం మాట్లాడుకున్నా తాము పట్టించుకోమని, తనను ఇంకోసారి అలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు.
బయటి వారు ఏం మాట్లాడుకున్నా తాము పట్టించుకోమని, తనను ఇంకోసారి అలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ దృష్టి అంతా ప్రపంచకప్ గెలవడంపైనే ఉందని, ఇక నుంచైనా బయట వాగే చెత్త గురించి తనను ప్రశ్నించరని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా తాను ఇక నుంచి అలాంటి కామెంట్లకు సమాధానం ఇవ్వనని అన్నాడు. వన్డే ప్రపంచకప్‌నకు భారత జట్టును ప్రకటించే సమయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయని, దీనిపై మీ స్పందనేంటని ఓ జర్నలిస్ట్ రోహిత్ శర్మను ప్రశ్నించాడు. దీంతో సదరు జర్నలిస్ట్‌పై హిట్‌మ్యాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతనికి ఘాటు సమాధానం ఇచ్చాడు. ‘‘ఇలాంటి ప్రశ్నలను నేను ప్రోత్సహించను. పైగా ఆ ప్రశ్నలకు నేను ఇప్పటికే చాలా సార్లు సమాధానం ఇచ్చాను. బయట ఎవరు ఏం మాట్లాడుకున్నా మేం పట్టించుకోం. జట్టులోని ప్రతి ఆటగాడు ప్రొఫెషనల్ ఆటగాడే. ఇలాంటి ప్రశ్నలు మళ్లీ అడగొద్దు. ఇలాంటి విషయాలపై స్పందించడం కూడా సరైంది కాదు. ప్రస్తుతం మా దృష్టంతా ఆటపైనే ఉంది.’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
అలాగే అందుబాటులో ఉన్న ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ జట్టును ఎంపి చేశామని రోహిత్ చెప్పాడు. తమ దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నారని, ఇతర బౌలింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తమకు పూర్తి ప్యాకేజీ ఆటగాడన్న రోహిత్.. అతని ఫామ్ ప్రపంచకప్‌లో తమకు కీలకం కానుందని చెప్పుకొచ్చాడు. ఇక తుది జట్టు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడే చెప్పలేమన్న హిట్‌మ్యాన్.. మ్యాచ్ రోజు ఉండే పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. ‘‘దురదృష్టవశాత్తు కొందరికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. కానీ టీమిండియాలో అద్భుతమైన టాలెంట్‌కు కొదవలేదు. ప్రపంచకప్‌నకు 15 మందినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రపంచకప్‌నకు జట్టును ఎంపిక చేసినప్పుడు ఇలాంటివి జరగడం సహజమే. ఇప్పుడేమి సర్‌ప్రైజ్ లేదు’’ అని రోహిత్ అన్నాడు. కాగా ప్రపంచకప్ జట్టులో స్టార్ ఆటగాళ్లు చాహల్, శిఖర్ ధావన్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణకు చోటు దక్కని సంగతి తెలిసిందే.
ప్రపంచకప్‌నకు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్