World cup Team India: టీమిండియా.. అసలు బలం ఎందులో ఉంది..?
ABN , First Publish Date - 2023-03-23T16:48:41+05:30 IST
కంగారూల చేతిలో దెబ్బతిన్నది రోహిత్ శర్ సేన (Rohit sharma team). పరిణామాలు.. జట్టు బలాబలాలు చూస్తుంటే.. ఉగాది రోజు చెప్పుకొనేందుకు చేదుగా ఉన్నా.. ఎంత సొంతగడ్డపై జరిగినా.. ఇది అసలు వన్డే ప్రపంచ కప్ కొట్టగలిగే జట్టేనా? అనిపిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు మరి..
ముంబై వాంఖడేలో 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆపసోపాలు పడ్డారు.. అచ్చొచ్చిన విశాఖపట్టణంలో వంద పరుగులు చేయడానికే కిందామీద అయ్యారు.. చెన్నై చెపాక్‌లో మోస్తరు టార్గెట్‌నూ చేధించలేకపోయారు.. మొత్తానికి టీమిండియా వన్డే సిరీస్‌ను (IndiaVsAustralia ODI series) ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. తొలి రెండు టెస్టుల్లో ఓడి.. మూడో టెస్టులో గెలిచి.. నాలుగో టెస్టును డ్రా చేసుకున్న కంగారూలు.. వన్డే సిరీస్‌లో మాత్రం భారత్‌పై ఆధిపత్యం కనబర్చారు. తొలి వన్డేలో గట్టి పోటీ ఇచ్చి.. మిగతా రెండింటినీ అలవోకగా తమ ఖాతాలో వేసుకున్నారు. వరుసగా రెండోసారి భారత గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ కప్ (Oneday worldcup) ముంగిట.. సరిగ్గా నాలుగేళ్ల కిందట 2019లో 2-0 ఆధిక్యంలో ఉండి కూడా 5 వన్డేల సిరీస్‌ను 3-2 తో కోల్పోయింది మన జట్టు. ఇప్పుడు కూడా ప్రపంచ కప్ (Oneday worldcup2023) కొద్ది నెలల్లో జరగనుందగా.. అదీ సొంత గడ్డపై జరగబోతుండగా.. కంగారూల చేతిలో దెబ్బతిన్నది రోహిత్ శర్ సేన (Rohit sharma team). పరిణామాలు.. జట్టు బలాబలాలు చూస్తుంటే.. ఉగాది రోజు చెప్పుకొనేందుకు చేదుగా ఉన్నా.. ఎంత సొంతగడ్డపై జరిగినా.. ఇది అసలు వన్డే ప్రపంచ కప్ కొట్టగలిగే జట్టేనా? అనిపిస్తోంది.
అసలు బలం ఎందులో ఉంది..?
బ్యాటింగ్‌లో స్థిరత్వం లేదు.. బౌలింగ్‌లో గాయాల బెడద.. ఒక మ్యాచ్ గెలిస్తే మరో మ్యాచ్ ఓడుతోంది.. అసలు బలంగా ఏ విభాగంలో ఉంది అంటే చెప్పలేని పరిస్థితి. బలమైన జట్టయిన ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌నే (IndiaVsAustralia) తీసుకుంటే ఒక్కరంటే ఒక్క బ్యాట్స్‌మన్ మూడు వన్డేల్లో సెంచరీ కొట్టలేకపోయాడు. విశాఖలో అయితే జట్టంతా కలిపినా వంద పరుగులు చేసేందుకు చెమటోడ్చింది. బౌలర్ల ప్రతిభతో తొలి వన్డే గెలిచినా.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో వారూ తేలిపోయారు. ఒకవిధంగా చెప్పాలంటే 2019 పోలిస్తే టీమిండియా ఇప్పుడు బలహీనంగా ఉంది. అప్పట్లో చూస్తే.. కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat kohli) దుమ్మురేపే ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit shamrma) ఆకాశమే హద్దు అన్నట్లు భారీ స్కోర్లు కొట్టాడు. కేఎల్ రాహుల్(KL Rahul), శిఖర్ ధావన్(Shikhav dhavan), హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగల జోష్‌లో ఉన్నారు. వీరిలో ధావన్ తప్ప ప్రస్తుతం అందరూ ఉన్నా, జట్టు ప్రదర్శన మాత్రం పూర్తి నిరాశజనంగా ఉంది. అన్నిటికి మించి నాలుగేళ్ల కిందట ప్రపంచ కప్‌లో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు అతడు కూడా లేడు.
ఓటమి కాదు.. ఓడిన తీరే..
2023లో మన జట్టు.. సొంత గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లు గెలిచింది. అంతకుమందు బంగ్లాదేశ్ వెళ్లి మూడు వన్డేల సిరీస్‌ను (One day series) చావుతప్పి కన్నులొట్ట బోయిన చందగా 2-1తో వశం చేసుకుంది. ఇప్పుడు ఆసీస్‌తో (Cricket australia) మాత్రం చేతులెత్తేసింది. తాజాగా కంగారూలతో సిరీస్‌లో ఓడినందుకు కాదు.. ఓడిన తీరే ఆందోళనకరంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఆఖరికి ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలోనూ టీమిండియా (Team India) మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శన ఒక్కటంటే ఒక్కటీ లేదు. కెప్టెన్ రోహిత్ ఫామ్ (Rohit sharma) అంతంతే.. విరాట్ కోహ్లి ఇదివరకటిలా మ్యాచ్‌లను గెలిపించలేకపోతున్నాడు. మిడిలార్డర్ మరీ నిస్సారం. కేఎల్ రాహుల్ ఎప్పుడు ఆడతాడో తెలియదు. హార్దిక్ పాండ్యా మీద ఎంతగా అని ఎన్నాళ్లని ఆధారపడగలరు... పేసర్లు షమీ(Mohammad shami), సిరాజ్ (Mohammad siraj) శక్తివంచన లేకుండా ప్రయత్నించినా.. టీమ్ గేమ్ క్రికెట్‌లో గెలవాలంటే ఒక్కరి ప్రతిభ సరిపోదు కదా..?
మిగిలింది 8-9 వన్డేలే..?
2023 వన్డే ప్రపంచ కప్‌కు (2023 Oneday world cup) భారత్ తొలిసారి ఒంటరిగా ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబరు, నవంబరులో సొంతగడ్డపై జరుగుతున్నందున ఫేవరెట్ జట్లలో భారత్ ఒకటనడంలో తప్పులేదు. కానీ, అది మనకి మనం గొప్ప చెప్పుకోవడమే. స్వదేశంలో ఇప్పటికైతే వన్డే సిరీస్‌లు లేవు. ఈ నెల 31 నుంచి టి20 లీగ్ ఐపీఎల్ (IPL2023) షురూ కానుంది. టీమిండియా తదుపరి వన్డే (వెస్టిండీస్‌తో 3 మ్యాచ్‌ల సిరీస్) దాదాపు ఆగస్టులో ఉంది. ఆపై సెప్టెంబరులో ఆసియా కప్ (Asia cup) ఉంది. అయితే, ఇది పాకిస్థాన్ (Pakistan) వేదికగా జరుగుతుంది. ఆ దేశంలో మన జట్టు పర్యటించడం కష్టమే. ఆ తర్వాత అక్టోబరులో ఆసీస్‌తోనే స్వదేశంలో మూడు వన్డేలు ఆడనుంది. అంటే.. ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ ముంగిట టీమిండియాకు మహా అయితే 8 లేదా 9 వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. అంతా సిద్ధంగా ఉన్న ఒక జట్టుకు అయితే ఇవి ప్రపంచ కప్ ముంగిట ప్రాక్టీస్ మ్యాచ్ లు. కానీ, టీమిండియాకు ఇప్పుడలా చెప్పుకోవడానికి వీల్లేదు.
ఫామ్ లేదు.. గాయాల బెంగ..
క్రికెట్‌లో భారత్ ప్రపంచ విజేతగా నిలిచి 12 ఏళ్లు దాటిపోతోంది. ఈ మధ్యలో జరిగిన రెండు వన్డే ప్రపంచ కప్‌లలో సెమీస్‌లోనే నిష్క్రమించింది. టి20 ప్రపంచ కప్‌లలో చేతులెత్తేసింది. టెస్టు చాంపియన్ షిప్‌లో (world test championship) గద అందుకోలేకపోయింది. మళ్లీ మన దేశం విశ్వ విజేతగా నిలిచేందుకు సొంతగడ్డపై జరగనున్న వన్డే ప్రపంచ కప్ ఓ మహదవకాశం. 2011లో ఇలానే జయభేరి మోగించింది. చిత్రమేమంటే.. ఆ తర్వాత రెండు కప్ (2015, 2019)లను ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గెలుచుకున్నాయి. ఈ లెక్కన సొంతగడ్డ అనుకూలతతో వచ్చే కప్ మన ఖాతాలో పడాలి. అయితే, ఇది సాధ్యమేనా? అంటే చెప్పలేం. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఫామ్ గొప్పగా ఏమీ లేదు. మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ తరచూ గాయపడుతున్నాడు. కేఎల్ రాహుల్‌ది అంతా గాలివాటమే. సూర్య కుమార్ యాదవ్ టీ20 ప్రతాపాన్ని వన్డేల్లో చూపలేకపోతున్నాడు. హార్దిక్ పాండ్యా తురుపుముక్కలా కనిపిస్తున్నా.. అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలున్నాయి. అన్నిటికి మించి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు అందుబాటులోనే లేవు. మిగతా పేసర్లు షమీ, సిరాజ్ గాయపడకుండా ఉంటే.. లక్ అనుకోవాలి. ఉమేశ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ వంటి పేసర్లున్నా వారిది వేగమే తప్ప నైపుణ్యం కాదు. దీపక్ చాహర్ ప్రతిభావంతుడే కానీ.. నిత్య గాయకుడు.
సరిచేసుకోవాల్సినవి ఎన్నో..?
బలహీనమైన బంగ్లాదేశ్, శ్రీలంక, అనూహ్యంగా ఆడే న్యూజిలాండ్ మీద వన్డే సిరీస్‌లు గెలిచి జబ్బలు చరుచుకున్న టీమిండియాకు ఆస్ట్రేలియాతో సిరీస్ వాస్తవం ఏమిటో చెప్పింది. వన్డే ప్రపంచ కప్ ముంగిట అసలు గెలవాల్సిందే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్ల మీద. ఓవైపు వన్డే చాంపియన్ ఇంగ్లండ్ ఒక్కో మ్యాచ్ లో 400 పరుగులు అవలీలగా బాదేస్తుంటే.. మన జట్టేమో స్వదేశంలోనూ 300 కొట్టలేకపోతోంది. వన్డే ప్రపంచ కప్‌నకు వచ్చేసరికి న్యూజిలాండ్ ప్రమాదకర ప్రత్యర్థే. గత ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్లో మనకు షాక్ ఇచ్చింది ఆ జట్టేనన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇక దక్షిణాఫ్రికాకూ టీమిండియాను ఓడించే సత్తా ఉంది. కాబట్టి.. ప్రపంచ కప్ ఏడెనిమిది నెలలు కూడా లేని నేపథ్యంలో భారత జట్టు లోపాలను సరిచేసుకోవాల్సి ఉంది. మిడిలార్డర్‌ను పటిష్ఠం చేసుకోవడం అందులో మరీ ముఖ్యమైనది. రోహిత్, కోహ్లీ పూర్వపు ఫామ్ అందుకోవడంతో పాటు పేస్ విభాగాన్ని సంసిద్ధం చేసుకోవాలి. మరో పేస్ ఆల్ రౌండర్‌ను బ్యాకప్‌గా ఉంచుకోవాలి. లేదంటే సొంత గడ్డపైనా ప్రపంచ కప్ కల నెరవేరడం కష్టమే.