IND-A vs PAK-A: సెంచరీతో సాయి సుదర్శన్ విధ్వంసం.. పాక్‌ను చితకొట్టిన భారత్

ABN , First Publish Date - 2023-07-19T21:13:33+05:30 IST

బౌలింగ్‌లో రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ నిప్పులు చెరిగే బంతులకు తోడు, బ్యాటింగ్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ (104) అజేయ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాకిస్థాన్-ఏ పై భారత్ -ఏ ఘనవిజయం సాధించింది. ఏకంగా మరో 13 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.

IND-A vs PAK-A: సెంచరీతో సాయి సుదర్శన్ విధ్వంసం.. పాక్‌ను చితకొట్టిన భారత్

కొలంబో: బౌలింగ్‌లో రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ నిప్పులు చెరిగే బంతులకు తోడు, బ్యాటింగ్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ (104) అజేయ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాకిస్థాన్-ఏ పై భారత్ -ఏ ఘనవిజయం సాధించింది. ఏకంగా మరో 13 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. పాకిస్థాన్ విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయసంగా చేధించింది. మొదటి వికెట్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పాట్నర్‌షిప్ నెలకొల్పి శుభారంభాన్ని అందించారు. అయితే 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ కావడంతో 58 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం నికిన్ జోస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన సాయి సుదర్శన్ రెండో వికెట్‌కు 99 పరుగుల పాట్నర్‌షిప్ నెలకొల్పాడు. పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వీరిద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే ఈ పాట్నర్‌షిప్‌ను 31వ ఓవర్లో మెహ్రాన్ ముంతాజ్ బ్రేక్ చేశాడు. 53 పరుగులు చేసిన నికిన్ జోస్‌ను స్టంపౌట్ అయ్యాడు.


అనంతరం కెప్టెన్ యష్ ధూల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన సాయి సుదర్శన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ధాటిగా ఆడిన వీరిద్దరు మరో 13 ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియాకు ఘనవిజయాన్ని అందించారు. ఈ క్రమంలో సాయి సుదర్శన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సాయి సుదర్శన్ సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం విశేషం. మొత్తంగా 110 బంతులు ఎదుర్కొన్న సాయి 10 ఫోర్లు, 3 సిక్సులతో 110 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 19 బంతుల్లో 21 పరుగులు చేసిన యష్ ధూల్ కూడా నాటౌట్‌గా నిలిచాడు. కాగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయి సుదర్శన్ గత సీజన్‌లో దుమ్మలేపిన సంగతి తెలిసిందే. అదే ఫామ్‌ను ఆసియా కప్‌లోనూ కొనసాగించాడు.

అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్-ఏ జట్టు భారత బౌలర్ల దెబ్బకు 205 పరుగులకే ఆలౌటైంది. పేసర్ రాజ్‌వర్ధన్ హంగర్గేకర్(5/42) నిప్పులు చెరిగే బంతులకు, మానవ్ సుతార్(3/36) స్పిన్ మాయజాలం కూడా తోడవడంతో పాకిస్థాన్ బ్యాటర్లు పరుగుల కోసం శ్రమించాల్సి వచ్చింది. దీంతో మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఆలౌటైంది. ఒకానొక దశలో 95 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఖాసిం అక్రమ్(48), ముబాసిర్ ఖాన్(28), మెహ్రాన్ ముంతాజ్(25) ఆదుకోవడంతో పాక్ స్కోర్ 200 దాటింది. పాక్ జట్టులో 48 పరుగులు చేసిన ఖాసిం అక్రమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సాహిబ్జాదా ఫర్హాన్ 35, హసీబుల్లా ఖాన్ 27 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ 5 వికెట్లతో చేలరేగగా.. మానవ్ సుతార్ 3 వికెట్లతో సత్తా చాటాడు. రియాన్ పరాగ్, నిషాంత్ సింధు తలో వికెట్ తీశారు. సాయి సుదర్శన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Updated Date - 2023-07-19T21:17:38+05:30 IST