Asia cup 2023: గ్రౌండ్‌లో కొట్టుకున్న భారత్, శ్రీలంక ఫ్యాన్స్.. వీడియో ఇదిగో!

ABN , First Publish Date - 2023-09-13T21:58:52+05:30 IST

ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం గ్యాలరీలోని కొంతమంది భారత్, శ్రీలంక అభిమానులు ఘర్షణకు దిగారు

Asia cup 2023: గ్రౌండ్‌లో కొట్టుకున్న భారత్, శ్రీలంక ఫ్యాన్స్.. వీడియో ఇదిగో!

కొలంబో: ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో గెలిచిన రోహిత్ సేన ఆసియా కప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం గ్యాలరీలోని కొంతమంది భారత్, శ్రీలంక అభిమానులు ఘర్షణకు దిగారు. ఒకరిపై మరొకరు పిడి గుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. శ్రీలంక జెర్సీలో ఉన్న ఒక వ్యక్తి పసుపు రంగు టీషర్ట్ వేసుకున్న వ్యక్తిపై దాడికి దిగాడు. దీంతో అతను ఎదురుదాడి చేశాడు. ఈ క్రమంలో గొడవ పెద్దదైంది. రెండు బృందాలుగా వీడిపోయి కొట్టుకున్నారు. ఆ గొడవను కొందరు ఆపే ప్రయత్నం చేయడం వీడియోలో చూడొచ్చు. అయితే ఈ ఘటన జరుగుతున్నంతసేపు ఒక మహిళా కానిస్టేబుల్ అక్కడే ఉండడం వీడియోలో కనిపిస్తోంది. కానీ ఆ మహిళా కానిస్టేబుల్ ఆ గొడవను ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అయితే క్రికెట్ గ్రౌండ్లలో అభిమానులు ఇలా కొట్టుకోవడం ఇది మొదటి సారి ఏం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.


ఇక ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో భారత్‌ వరుసగా రెండో గెలుపు నమోదుచేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే నాలుగు పాయింట్లతో తుది పోరుకు అర్హత సాధించింది. సూపర్‌-4లో భారత్‌ తన చివరి మ్యాచ్‌ను శుక్రవారం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. లంకతో పోరులో కెప్టెన్‌ రోహిత్‌ (48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53) హ్యాట్రిక్‌ అర్ధసెంచరీ సాధించగా.. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (4/43) మరోసారి దెబ్బతీశాడు. ముందుగా భారత్‌ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ (39), ఇషాన్‌ (33), అక్షర్‌ (26) ఫర్వాలేదనిపించారు. దునిత్‌ వెల్లలగెకు 5, అసలంకకు 4 వికెట్లు దక్కాయి. ఛేదనలో శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. వెల్లలగె (42 నాటౌట్‌), ధనంజయ డిసిల్వా (41) రాణించారు. ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న లంక స్టార్‌ వెల్లలగె మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Updated Date - 2023-09-13T21:58:52+05:30 IST