Share News

Hardik Pandya: మరో 4 నెలలపాటు పాండ్యా దూరం

ABN , First Publish Date - 2023-11-22T10:51:36+05:30 IST

అసలే వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిన బాధలో ఉన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి మధ్యలోనే నిష్క్రమించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో కోలుకునేలా కనిపించడంలేదు.

Hardik Pandya: మరో 4 నెలలపాటు పాండ్యా దూరం

అసలే వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిన బాధలో ఉన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి మధ్యలోనే నిష్క్రమించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో కోలుకునేలా కనిపించడంలేదు. అతను కోలుకోవడానికి మరో 4 నెలల సమయం పట్టేలా ఉంది. ఈ మేరకు ఓ జాతీయ క్రీడా వెబ్‌సైట్ తమ కథనంలో పేర్కొంది. సదరు కథనం ప్రకారం హార్దిక్ పాండ్యా మళ్లీ ఐపీఎల్‌లోనే గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. ఐపీఎల్‌ 2024లోనే హార్దిక్ పాండ్యా మళ్లీ క్రికెట్ ఆడే అవకాశాలున్నాయని సదరు జాతీయ మీడియా పేర్కొంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో జరిగే దక్షిణాఫ్రికా పర్యటనతోపాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడు.


ఇప్పటికే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఒకవేళ ఫైనల్లో హార్దిక్ పాండ్యా ఆడి ఉంటే టీమిండియా గెలిచి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టును హార్దిక్ పాండ్యానే లీడ్ చేస్తున్నాడు. 2024 సెకండాఫ్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యానే టీమిండియా కెప్టెన్‌గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమవడం ఆందోళనకు గురి చేసే అంశమనే చెప్పుకోవాలి. కాగా వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. చీలమండ గాయం కావడంతో బెంగళూరులోని ఏన్సీఏలో చేరాడు. నాకౌట్ మ్యాచ్‌ల నాటికి జట్టులో చేరతాడని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు. సౌతాఫ్రికా టూర్‌ నాటికైనా కోలుకుని జట్టులో చేరతాడని అంతా భావించారు. కానీ ప్రస్తుతం అది కూడా జరిగేలా కనిపించడం లేదు.

Updated Date - 2023-11-22T13:12:13+05:30 IST