IND vs SL Final: నిప్పులు కక్కుతున్న మహ్మద్ సిరాజ్.. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు ఫట్!

ABN , First Publish Date - 2023-09-17T16:23:30+05:30 IST

శ్రీలంకతో జరగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు కక్కాడు. ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి విశ్వరూపం చూపించాడు.

IND vs SL Final: నిప్పులు కక్కుతున్న మహ్మద్ సిరాజ్.. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు ఫట్!

కొలంబో: శ్రీలంకతో జరగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు కక్కాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టి విశ్వరూపం చూపించాడు. తాను వేసిన 4వ ఓవర్‌లో వరుసగా నిసాంక(2), సదీర సమరవిక్రమ(0), చరిత అసలంక(0), దనుంజయ డిసిల్వాను(4) పెవిలియన్ చేర్చాడు. దీంతో అతిథ్య జట్టు శ్రీలంక 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సిరాజ్ వేసిన నాలుగో ఓవర్ మొదటి బంతికే నిసాంక ఇచ్చిన క్యాచ్‌ను రవీంద్ర జడేజా అద్భుతంగా అందుకున్నాడు. రెండో బంతి డాట్ అయింది. మూడో బంతికి సమర విక్రమ లెగ్‌బైస్‌లో ఔట్ అయ్యాడు. నాలుగో బంతికి అసలంక ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ కిషన్ అందుకున్నాడు. ఐదో బంతి ఫోర్ వెళ్లింది. ఆరో బంతికి డి సిల్వా ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అందుకున్నాడు. దీంతో ఈ ఓవర్‌లో సిరాజ్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఓవర్‌ సిరాజ్ బంతి వేస్తే వికెట్ అన్నట్టుగా సాగింది. సిరాజ్ కెరీర్‌లోనే ఇది డ్రీమ్ స్పెల్‌గా నిలిచిపోయింది. అంతకుముందు మొదటి ఓవర్లోనే కుశల్ పెరీరాను బుమ్రా డకౌట్ చేశాడు. దీంతో శ్రీలంక 12 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవర్‌లో మరోసారి చెలరేగిన సిరాజ్.. శ్రీలంక కెప్టెన్ దసున్ శనకను డకౌట్ చేశాడు. శనక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 12 పరుగులకే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయింది. కాగా సిరాజ్ 10 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టాడు. ఏకంగా నలుగురు లంక బ్యాటర్లను డకౌట్ చేశాడు.


అంతకుముందు అతిథ్య జట్టు శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్స్ పడింది. దీంతో శ్రీలంక టాస్ గెలిచింది. టాస్ గెలిచిన దసున్ శనక ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్టు శనక చెప్పాడు. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ జట్టులోకి ఈ రోజ్ మ్యాచ్ ఆడుతున్నట్టు చెప్పాడు. అలాగే గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అక్షర్ పటేల్ అందుబాటులో లేడని, అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. అయితే సరిగ్గా మ్యాచ్ ప్రారంభ సమయానికి వర్షం రావడంతో ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. 3 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 40 నిమిషాలు ఆలస్యంగా 3 గంటల 40 నిమిషాలకు ప్రారంభమైంది.

తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశల్ పెరీరా, కుశల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన

Updated Date - 2023-09-17T16:34:37+05:30 IST