IND vs SL: 20 ఏళ్ల కుర్రాడి దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్లు!

ABN , First Publish Date - 2023-09-12T21:04:45+05:30 IST

శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలాగే(5/40), చరిత్ అసలంక(4/14) భారత బ్యాటర్లను వణికించారు. ముఖ్యంగా టాపార్డర్‌ను 20 ఏళ్ల వెల్లలాగే కుప్పకూల్చాడు.

IND vs SL: 20 ఏళ్ల కుర్రాడి దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్లు!

కొలంబో: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 213 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లంతా స్పిన్నర్లకే తమ వికెట్లు సమర్పించుకున్నారు. శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలాగే(5/40), చరిత్ అసలంక(4/14) భారత బ్యాటర్లను వణికించారు. ముఖ్యంగా టాపార్డర్‌ను 20 ఏళ్ల వెల్లలాగే కుప్పకూల్చాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌ను ఉపయోగించుకుని టీమిండియా స్టార్ బ్యాటర్ల వికెట్లను సునాయసంగా ఖాతాలో వేసుకున్నాడు. ఒకానొక దశలో 80/0తో స్ట్రాంగ్‌గా ఉన్న టీమిండియా 12వ ఓవర్లో వెల్లలాగే ఎంట్రీతో కుప్పకూలింది. అప్పటివరకు క్రీజులో కుదురుకుని అద్భుతంగా ఆడుతున్న శుభ్‌మన్ గిల్(19), రోహిత్ శర్మ(53).. వెల్లలాగే దెబ్బకు వరుస ఓవర్లలో క్లీన్‌బౌల్డ్ అయ్యారు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ(3) కూడా వెల్లలాగే బౌలింగ్‌లో సింగిల్ డిజిట్‌కే ఔటయ్యాడు. క్రీజులో కుదురుకున్న రాహుల్‌(39)తోపాటు హార్దిక్ పాండ్యా(5)ను సింగిల్ డిజిట్‌కే వెల్లలాగే పెవిలియన్ చేర్చాడు. ఇలా టీమిండియా స్టార్ల వికెట్లన్నీ వెల్లలాగేనే పడగొట్టాడు. మొత్తంగా 10 ఓవర్లలో 40 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో శ్రీలంక తరఫున అతి చిన్న వయసులోనే 5 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఒక్క ఇషాన్ కిషన్ మాత్రమే అసలంక బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక టీమిండియా టేలెండర్లను అసలంక పెవిలియన్ చేర్చాడు. పార్ట్ టైమ్ స్పిన్నరైన అసలంకకు 4 వికెట్లు పడ్డాయంటేనే పిచ్ ఏ స్థాయిలో టర్న్ అయిందో అర్థం చేసుకోవచ్చు. కాగా టీమిండియా స్టార్ బ్యాటర్లందరినీ ఔట్ చేసిన వెల్లలాగే వయసు 20 సంవత్సరాల 246 రోజులు మాత్రమే.

Updated Date - 2023-09-12T21:04:45+05:30 IST