IND vs WI: ఓపెనర్‌గా గిల్ రావడం లేదు.. మొదటి టెస్ట్‌కు ప్లేయింగ్ 11పై స్పష్టతనిచ్చిన రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2023-07-12T12:33:12+05:30 IST

వెస్టిండీస్‌తో నేటి నుంచి ప్రారంభం కాబోయే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తనతోపాటు ఆడే ఓపెనర్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు. 21 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో తనతోపాటు ఓపెనర్‌గా ఆడతాడని, శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా టీమిండియా ఆడుతున్న మొదటి టెస్ట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం.

IND vs WI: ఓపెనర్‌గా గిల్ రావడం లేదు.. మొదటి టెస్ట్‌కు ప్లేయింగ్ 11పై స్పష్టతనిచ్చిన రోహిత్ శర్మ

డొమినికా: వెస్టిండీస్‌తో నేటి నుంచి ప్రారంభం కాబోయే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తనతోపాటు ఆడే ఓపెనర్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు. 21 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో తనతోపాటు ఓపెనర్‌గా ఆడతాడని, శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా టీమిండియా ఆడుతున్న మొదటి టెస్ట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొదటి టెస్ట్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ తనతోపాటు ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని ప్రకటించాడు. దీనిని బట్టి మొదటి టెస్ట్ మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయబోతున్నాడన్నమాట. తద్వారా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కుదురుతుందని చెప్పుకొచ్చాడు.


అలాగే శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని తెలిపాడు. ఈ విషయంపై అతను హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో కూడా చర్చించాడని చెప్పాడు. జైస్వాల్ ఎక్కువ కాలం ఓపెనర్‌గా ఆడతాడని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. నిజానికి టీమిండియా చాలా కాలంగా ఓపెనింగ్‌లో సరైన లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్ కోసం వెతుకుతోంది. జైస్వాల్ రాకతో ఆ సమస్య తీరినట్టుగానే కనిపిస్తోంది. "గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అతనే స్వయంగా 3వ స్థానంలో ఆడాలనుకుంటున్నాడు. దీనిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో కూడా చర్చించాడు. గిల్ తన క్రికెట్ మొత్తం 3, 4వ స్థానాలో ఆడాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే మరింత మెరుగ్గా రాణించగలడని గిల్ భావిస్తున్నాడు. ఇది మాకు కూడా మంచిదే. ఎందుకంటే దీంతో ఓపెనింగ్‌లో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ సెట్ అవుతుంది. కాబట్టి మేము ఈ కాంబినేషన్‌లో ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ కాంబినేషన్ చాలా కాలం పాటు కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము చాలా సంవత్సరాలుగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కోసం వెతుకుతున్నాము. ఇప్పుడు మనకు ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దొరికాడు. అతను మంచి ప్రదర్శన ఇస్తాడని ఆశిద్దాం. అది జట్టుకు కూడా మంచిది. జైస్వాల్ సుదీర్ఘ కాలం ఓపెనింగ్ స్థానాన్ని సొంతం చేసుకోగలడు." అని రోహిత్ శర్మ చెప్పాడు.

అంతేకాకుండా మ్యాచ్ జరిగే విండ్సర్ పార్క్ పిచ్ పేస్‌కు అనుకూలిస్తుంది కాబట్టి తాము ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్టు కెప్టెన్ తెలిపాడు. రోహిత్ శర్మ వ్యాఖ్యలను బట్టి టీమిండియా ప్లేయింగ్ 11పై ఓ స్పష్టత వచ్చిందనే చెప్పుకోవాలి. అయితే వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్, ఇషాన్ కిషన్‌లలో ఎవరికీ చోటు కల్పిస్తారనే విషయాన్ని హిట్‌మ్యాన్ వెల్లడించలేదు. దీంతో వికెట్ కీపర్‌ ఎంపికపై స్పష్టత రావాలంటే టాస్ వేసే వరకు ఎదురు చూడాల్సిందే. కాగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

Updated Date - 2023-07-12T12:33:12+05:30 IST