Share News

IND vs AUS: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. పాకిస్థాన్‌తో సమంగా..

ABN , First Publish Date - 2023-11-27T08:39:52+05:30 IST

India vs Pakistan: ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన భారత జట్టు ఆస్ట్రేలియాపై 44 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది.

IND vs AUS: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. పాకిస్థాన్‌తో సమంగా..

తిరువనంతపురం: ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన భారత జట్టు ఆస్ట్రేలియాపై 44 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. మిగిలిన మూడింటిలో ఒకటి గెలిచినా సిరీస్ మన సొంతమవుతుంది. ఈ విజయంతో టీ20 క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో పాకిస్థాన్‌తో కలిసి మొదటి స్థానంలో ఉంది. రెండు జట్లు కూడా ఇప్పటివరకు 135 మ్యాచ్‌ల చొప్పున గెలిచాయి. అయితే పాకిస్థాన్ జట్టు 135 విజయాలు నమెదు చేయడానికి 226 మ్యాచ్‌లు ఆడింది. కానీ భారత జట్టు మాత్రం 211 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. దీంతో వేగంగా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత జట్టు మరొక మ్యాచ్ గెలిస్తే టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలవనుంది.


ఇక ఈ మ్యాచ్‌లో మరిన్ని మైల్‌స్టోన్స్ కూడా నమోదయ్యాయి.

77/1- ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో టీమిండియా 77/1 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై టీ20 ఫార్మాట్‌లో పవర్‌ప్లేలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో 2016లో సిడ్నీలో జరిగిన టీ20 మ్యాచ్‌లో చేసిన 74/1ను టీమిండియా అధిగమించింది.

53- ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ పవర్‌ప్లేలోనే 53 పరుగులు చేశాడు. దీంతో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో గతంలో 50 పరుగుల చొప్పున చేసిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను జైస్వాల్ అధిగమించాడు.

3- ఈ మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీ ద్వారా ఇషాన్ కిషన్ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన టీమిండియా వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 3 సార్లు ఈ మార్కు అందుకున్న కేఎల్ రాహుల్‌తో కలిసి సమంగా మొదటి స్థానంలో ఉన్నాడు.

235/4 – టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో గత మ్యాచ్‌లో చేసిన 209/8 స్కోర్‌ను టీమిండియా అధిగమించింది.

1- ఈ మ్యాచ్‌లో టీమిండియా టాప్ 3 బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు సాధించారు. కాగా టీ20 ఫార్మాట్‌లో మన టాప్ 3 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

235 – టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. 243 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.

Updated Date - 2023-11-27T08:39:54+05:30 IST