IND vs WI: రెండో టెస్ట్ మ్యాచ్‌తో భారత్ vs వెస్టిండీస్ మధ్య సెంచరీ పూర్తి

ABN , First Publish Date - 2023-07-19T21:53:11+05:30 IST

గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌తో భారత్, వెస్టిండీస్ (West Indies vs India) జట్ల మధ్య 100 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. అంటే సెంచరీ పూర్తి కానుంది.

IND vs WI: రెండో టెస్ట్ మ్యాచ్‌తో భారత్ vs వెస్టిండీస్ మధ్య సెంచరీ పూర్తి

ట్రినిడాడ్: గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌తో భారత్, వెస్టిండీస్ (West Indies vs India) జట్ల మధ్య 100 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. అంటే సెంచరీ పూర్తి కానుంది. దీంతో రెండు జట్లకు ఇది అరుదైన మైలురాయిగా నిలవనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ 30 మ్యాచ్‌ల్లో గెలవగా.. భారత జట్టు 23 మ్యాచ్‌ల్లో గెలిచింది. 46 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. విండీస్‌తో 2002 నుంచి భారత జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం.


కాగా భారత జట్టు 100 టెస్ట్ మ్యాచ్‌లాడిన మూడో టీంగా వెస్టిండీస్ నిలవనుంది. వెస్టిండీస్‌ కంటే ముందు భారత జట్టు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో కూడా 100 టెస్ట్ మ్యాచ్‌ల చొప్పున ఆడింది. భారత జట్టు ఇప్పటివరకు అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లను ఇంగ్లండ్‌తో (England) ఆడింది. ఆ జట్టుతో ఏకంగా 131 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో (Australia) 107 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. మొత్తంగా ఇప్పటివరకు అన్ని జట్లతో కలిపి 570 టెస్ట్ మ్యాచ్‌లాడిన టీమిండియా 172 మ్యాచ్‌ల్లో గెలిచింది. 176 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 221 టెస్ట్ మ్యాచ్‌లు డ్రాగా ముగియగా.. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. టెస్ట్ ఫార్మాట్లో భారత విజయాల శాతం 30.17గా ఉంది. ఓటముల శాతం 30.87 కాగా.. డ్రా గా ముగిసిన మ్యాచ్‌ల శాతం 38.77గా ఉంది.

Updated Date - 2023-07-19T21:55:51+05:30 IST