World Cup: క్రికెట్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన బీసీసీఐ.. ఈ సారి వరల్డ్ కప్‌లో ఆ హంగామా మిస్!
ABN , First Publish Date - 2023-10-05T11:25:29+05:30 IST
క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023కు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లోనే ప్రపంచకప్ ప్రారంభంకాబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ మైదానం వేదికగా ప్రపంచకప్ ఆరంభం కానుంది.
క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023కు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లోనే ప్రపంచకప్ ప్రారంభంకాబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ మైదానం వేదికగా ప్రపంచకప్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గత ప్రపంచకప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులను కాస్త నిరాశపరిచే వార్త ఒకటి ప్రస్తుతం బయటికొచ్చింది. సాధారణంగా ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల ఆరంభానికి ముందు ప్రారంభ వేడుకలు నిర్వహిస్తుంటారు. టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు గానీ లేదంటే ప్రారంభ మ్యాచ్‌కు ముందు గానీ ఈ వేడులను నిర్వహిస్తుంటారు. ఆ వేడుకల్లో పలువురు ప్రముఖ తారలు ఆడి, పాడి అభిమానులను అలరిస్తారు. అంతెందుకు మన దేశంలో ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్‌కు ముందు కూడా బీసీసీఐ ప్రారంభవేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటుంది. దీంతో ఐపీఎల్ ప్రారంభ వేడుకలనే అంతా ఘనంగా నిర్వహిస్తే ప్రపంచకప్ ప్రారంభ వేడుకలను ఏ రేంజులో నిర్వహిస్తారో అని అంతా భావించారు.
కానీ వారందరినీ ఇది నిరాశకు గురి చేసే వార్త అనే చెప్పుకోవాలి. అది ఏంటంటే ప్రపంచకప్‌నకు ముందు ఎలాంటి ప్రారంభవేడుకలు లేవని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం ప్రపంచకప్‌నకు ముందు ప్రారంభ వేడుకలను నిర్వహించడానికి బీసీసీఐ అసలు ప్లానే చేయలేదట. ఓ జాతీయ మీడియా తన కథనంలో తెలిపిన వివరాల ప్రకారం ‘‘ప్రపంచకప్ కోసం ప్రారంభ వేడుకలను ప్లాన్ చేయలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు సాయంత్రం ప్రారంభ అవుతాయి కాబట్టి ప్రారంభ వేడుకలను నిర్వహించడానికి మధ్యాహ్నం నుంచి సమయం ఉంటుంది. కానీ ప్రపంచకప్ మ్యాచ్‌లు మధ్యాహ్నం ప్రారంభమవుతాయి కాబట్టి ప్రారంభ వేడుకలను నిర్వహించడానికి సమయం ఉండదు’’ అని పేర్కొంది. దీనిని బట్టి ప్రపంచకప్ ప్రారంభవేడుకలు లేవని అర్థమవుతోంది. పైగా ప్రారంభ వేడుకలపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఒక వేళ నిర్వహించాలని భావిస్తే బుధవారమే నిర్వహించేవారు. కానీ బుధవారం అది జరగలేదు. నేడు మ్యాచ్‌కు ముందు జరగడం కూడా కష్టమనే చెప్పుకోవాలి. దీంతో అభిమానులను బీసీసీఐ నిరాశపరిచిందని పలువురు అంటున్నారు.
నిజానికి కొన్ని రోజుల క్రితం ప్రపంచకప్ ప్రారంభ వేడకలను ఘనంగా నిర్వహించడానికి బీసీసీఐ ప్లాన్ చేస్తుందని వార్తలొచ్చాయి. ఈ వేడుకల్లో రణ్‌వీర్ సింగ్, అరిజిత్ సింగ్, తమన్నా భాటియా, శ్రేయా ఘోషల్, ఆశా భోంస్లే వంటి ప్రముఖ సెలబ్రెటీలు పాల్గొనబోతున్నారని కూడా ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ప్రస్తుతం అది ఏదీ లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. కాకపోతే మరికొన్ని నివేదికల ప్రకారం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రోజు లేదా టోర్నీ మధ్యలో ఈ వేడుకలను నిర్వహించనున్నారని తెలుస్తోంది. లేదంటే టోర్నీ ముగిసాశ ముగింపు వేడుకలను నిర్వహిస్తారని సమాచారం. కానీ ఇప్పటివరకు దీనిపై కూడా బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ప్రారంభ వేడుకలు నిర్వహించకపోయినప్పటికీ టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు కెప్టెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. అలాగే వరల్డ్ కప్ ట్రోఫితో కలిసి ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు.