Share News

IND vs SA: టీమిండియా ‘ఏ’ జట్టులోకి సీనియర్ ఆటగాళ్లు.. జాబితాలో ఎవరెవరున్నారంటే..?

ABN , First Publish Date - 2023-11-25T07:09:08+05:30 IST

భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే సఫారీ పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. 10 నుంచి 14 వరకు టీ20 సిరీస్ జరగనుండగా, 17 నుంచి 21 వరకు వన్డే సిరీస్, డిసెంబర్ 26 నుంచి జనవరి 7 వరకు టెస్టు సిరీస్ జరగనుంది.

IND vs SA: టీమిండియా ‘ఏ’ జట్టులోకి సీనియర్ ఆటగాళ్లు.. జాబితాలో ఎవరెవరున్నారంటే..?

భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే సఫారీ పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. 10 నుంచి 14 వరకు టీ20 సిరీస్ జరగనుండగా, 17 నుంచి 21 వరకు వన్డే సిరీస్, డిసెంబర్ 26 నుంచి జనవరి 7 వరకు టెస్టు సిరీస్ జరగనుంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకు ఒకసారి కూడా టెస్టు సిరీస్ గెలవని టీమిండియా ఈ సారి ఆ లోటును తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ జట్టులోని పలువురు ఆటగాళ్లు టీమిండియా ‘ఏ’ జట్టులో ఆడనున్నారు. సఫారీ పర్యటన ప్రారంభానికి ముందే భారత్ ‘ఏ’ జట్టు అక్కడ పర్యటించనుంది. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌కు ముందే సౌతాఫ్రికా ‘ఏ’ జట్టుతో భారత్ ‘ఏ’ జట్టు 4 రోజుల చొప్పున జరిగే 3 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.


దీంతో భారత్ ‘ఏ’ జట్టు తరఫున సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, అజింక్యా రహానే, జయదేవ్ ఉనద్కత్ ఆడనున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టెస్టు సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌లు సీనియర్ ఆటగాళ్లకు సన్నాహకంగా ఉపయోగపడనున్నాయి. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒక్కరు స్పందిస్తూ “అవును. వచ్చే నెలలో భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ మధ్య మూడు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన టీమ్‌ను ప్రకటించనున్నారు. సెంచూరియన్ (డిసెంబర్ 26 నుండి 30 వరకు), కేప్ టౌన్ (జనవరి 3-7)లో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లకు ముందు జరిగే ఈ మ్యాచ్‌ల్లో సీనియర్ ఆటగాళ్లతోపాటు యువ ఆటగాళ్లు కూడా ఉంటారు.’’ అని తెలిపారు. సీనియర్లతో పాటు దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన యువ ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్, బి.సాయి సుదర్శన్, యష్ ధుల్, కోన భరత్, ఉపేంద్ర యాదవ్, సౌరభ్ కుమార్‌లకు భారత్ ‘ఏ’ జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-11-25T07:09:15+05:30 IST