Asia Cup 2023: సచిన్ రికార్డుపై రోహిత్, కోహ్లీ కన్ను.. అందుకు ఏం చేయాలంటే..?

ABN , First Publish Date - 2023-08-29T17:13:38+05:30 IST

ఆసియా కప్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. టీమిండియా ఆటగాళ్ల పరంగా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది.

Asia Cup 2023: సచిన్ రికార్డుపై రోహిత్, కోహ్లీ కన్ను.. అందుకు ఏం చేయాలంటే..?

ఆసియా కప్ 2023 బుధవారం నుంచే ప్రారంభంకానుంది. శ్రీలంక, పాకిస్థాన్ కలిసి సంయుక్తంగా అతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ పాక్, నేపాల్ మధ్య జరగనుంది. టోర్నీలో టీమిండియా ప్రయాణం సెప్టెంబర్ 2న ప్రారంభంకానుంది. 2న జరిగే మ్యాచ్‌లో టీమిండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇక ఈ సారి టైటిల్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే ఈ సారి ఆసియా కప్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. టీమిండియా ఆటగాళ్ల పరంగా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. సచిన్ 22 మ్యాచ్‌ల్లో 51 సగటుతో 971 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఉన్నారు. రోహిత్ శర్మ 22 మ్యాచ్‌ల్లో 46 సగటుతో 745 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలున్నాయి. అయితే రోహిత్ శర్మ మరో 226 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు.


ఇక మూడో స్థానంలో ఉన్న ధోని 19 మ్యాచ్‌లో 648 పరుగులు చేశాడు. అయితే సచిన్, ధోని ప్రస్తుతం ఆడడం లేదు. ఇక నాలుగో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో 61 సగటుతో 613 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. దీంతో ఈ సారి మరో 358 పరుగులు చేస్తే సచిన్‌ను కోహ్లీ కూడా అధిగమిస్తాడు. ఈ ఆసియా కప్‌లో భారత జట్టు కనీసం 5 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో రోహిత్, కోహ్లీ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబరిస్తే సచిన్‌ను అధిగమించడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఇక మొత్తంగా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య పేరు మీద ఉంది. జయసూర్య 25 మ్యాచ్‌ల్లో 53 సగటుతో 1220 పరుగుులు చేశాడు. ఆ తర్వాత సంగక్కర 1075 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 971 పరుగులు చేసిన సచిన్ మూడో స్థానంలో ఉన్నాడు.

Updated Date - 2023-08-29T17:13:38+05:30 IST