Womens Premier League: చితక్కొట్టిన లానింగ్, షెఫాలీ.. బెంగళూరు ఎదుట కొండంత లక్ష్యం!
ABN , First Publish Date - 2023-03-05T17:22:05+05:30 IST
మెగ్ లానింగ్(Meg Lanning), షెఫాలీ వర్మ(Shafali Verma) వీర బాదుడుతో ఢిల్లీ
ముంబై: మెగ్ లానింగ్(Meg Lanning), షెఫాలీ వర్మ(Shafali Verma) వీర బాదుడుతో ఢిల్లీ కేపిటల్స్(DC) స్కోరు పరుగులు తీసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు భారీ స్కోరు సాధించి ప్రత్యర్థికి సవాలు విసిరింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి ఢిల్లీకి బ్యాటింగ్ అప్పగించింది. అయితే, అదెంత తప్పుడు నిర్ణయమో లానింగ్, షెఫాలీ వీర విజృంభణ చూసి కానీ బెంగళూరు కెప్టెన్ మంధానకు అర్థం కాలేదు.
ఇద్దరూ కలిసి బంతులను కసిదీరా బాదుతూ పరుగుల వర్షం కురిపించారు. పోటీలు పడి పరుగులు సాధిస్తూ స్కోరు పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించి జోరు మరింత పెంచారు. మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరినీ విడదీసేందుకు బెంగళూరు(RCB) బౌలర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి హెదర్ నైట్ మ్యాజిక్ చేసి తొలి వికెట్ పడగొట్టింది. నైట్ వేసిన బంతిని ఆడడంలో తడబడిన కెప్టెన్ లానింగ్ క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో 162 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 43 బంతులు ఆడిన లానింగ్ 14 ఫోర్లతో 72 పరుగులు చేసింది. సెంచరీ ఖాయమనుకున్న షెఫాలీ వర్మ కూడా ఆ తర్వాత ఒక్క పరుగు తేడాతో నైట్ పెవిలియన్‌కు పంపింది. డబ్ల్యూపీఎల్ రెండో రోజే ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం గమనార్హం.
వీరిద్దరి అవుట్ తర్వాత వచ్చిన మరిజాన్ కాప్, జెమీమీ రోడ్రిగ్స్ కూడా దూకుడుగా ఆడారు. కాప్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి స్కోరును పరుగులు పెట్టించగా, రోడ్రిగ్స్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసింది.