IND vs WI: రోహిత్ శర్మ కూతురికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తిలక్ వర్మ.. సమైరా కోసం ఏం చేశాడంటే..?

ABN , First Publish Date - 2023-08-07T11:54:47+05:30 IST

టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దుల కూతురు సమైరాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తన తొలి హాఫ్ సెంచరీ వేడుకలను ఆ చిన్నారికి అంకింతం చేశాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల సమైరాతో తనకున్న సాన్నిహిత్యాన్ని తిలక్ వర్మ వ్యక్తపరిచాడు.

IND vs WI: రోహిత్ శర్మ కూతురికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తిలక్ వర్మ.. సమైరా కోసం ఏం చేశాడంటే..?

గయానా: టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దుల కూతురు సమైరాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తన తొలి హాఫ్ సెంచరీ వేడుకలను ఆ చిన్నారికి అంకింతం చేశాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల సమైరాతో తనకున్న సాన్నిహిత్యాన్ని తిలక్ వర్మ వ్యక్తపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తాను తొలి హాఫ్ సెంచరీ లేదా సెంచరీ సాధించినప్పుడు తన వేడుకలను సమైరాకు అంకితం చేస్తానని ఆ చిన్నారికి తిలక్ వర్మ గతంలో మాట ఇచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు ఆటగాడైన తిలక్ వర్మ హాఫ్ సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో తన వేడుకులను రోహిత్ శర్మ కూతురు సమైరాకు అంకితం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో సమైరాతో తనకున్న ప్రత్యేక బంధాన్ని తిలక్ వర్మ గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ.. "ఈ హాఫ్ సెంచరీ రోహిత్ భాయ్ కూతురు సామీ (సమైరా)కి అంకింతం ఇస్తున్నాను. నేను సామీకి చాలా సన్నిహితుడిని. నేను సెంచరీ చేసినా, ఫిఫ్టీ చేసినా ఆమె కోసం వేడుక చేస్తానని వాగ్దానం చేశాను." అని చెప్పుకొచ్చాడు. దీంతో తిలక్ వర్మపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రెండో టీ20లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. కాగా కెరీర్‌లో తిలక్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇక ఐపీఎల్‌లో తిలక్ వర్మ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ కుటుంబంతో తిలక్‌కు మంచి అనుబంధం ఏర్పడింది.


ఇక మ్యాచ్ విషయానికొస్తే టీ20 సీరీస్‌లో భారత్‌కు వరుసగా మరో ఓటమి ఎదురైంది. లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో మరోసారి టీమిండియా చతికిలపడింది. ముఖ్యంగా బ్యాటర్ల వైఫల్యం వరుసగా రెండో టీ20ల్లోనూ భారత్‌కు ఓటమిని రుచి చూపించింది. 152 పరుగులను కాపాడే క్రమంలో బౌలర్లు పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకనొక దశలో వెస్టిండీస్‌ను 129/8తో కష్టాల్లోకి నెట్టి గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆ జట్టు టేలెండర్లు అకేల్ హోసేన్(16), అల్జారీ జోసెఫ్(10) అద్భుతంగా పోరాడడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. నికోలస్ పూరన్(67)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక అంతకుముందు బ్యాటింగ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(51) తప్ప బ్యాటింగ్‌తో ఇతరులెవరూ రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది. కాగా ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 0-2తో వెనుకబడింది.

Updated Date - 2023-08-07T11:54:47+05:30 IST