TS Election: వారిద్దరిది నక్సల్స్ నేపథ్యం! ఆమె గెలిస్తే సంచలన రికార్డ్ సృష్టించినట్టే!
ABN , First Publish Date - 2023-11-16T05:09:18+05:30 IST
ఆయుధం వదిలి, జనజీవన స్రవంతిలో కలిసి.. నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం
ములుగులో అడవి బిడ్డల పోరు..
సీతక్కతో బీఆర్‌ఎస్ అభ్యర్థి నాగజ్యోతి ఢీ
ఇద్దరిదీ నక్సల్స్ నేపథ్యమే.. ఇరువురూ ఆదివాసీలే..
బీజేపీ నుంచి బరిలో చందూలాల్ తనయుడు
సానుభూతి, లంబాడా ఓట్లపై ప్రహ్లాద్ ఆశలు..
గిరిజనేతరులు, సెటిలర్ల ఓట్లు ఎవరికో!?
భూపాలపల్లి- ఆంధ్రజ్యోతి: ఒకరు.. స్వయంగా మాజీ నక్సలైట్. మరొకరు.. నక్సల్స్ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందినవారు. ఇద్దరూ ఆదివాసీ మహిళలే. ఆదివాసీ ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్న ములుగు నియోజకవర్గం నుంచే పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కను.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఢీకొడుతున్నారు. ఆయుధం వదిలి, జనజీవన స్రవంతిలో కలిసి.. నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం సీతక్కది. గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి.. నాలుగేళ్లలోనే ఎమ్మెల్యే పదవికి పోటీ పడుతున్న సంచలన రికార్డు నాగజ్యోతిది. మరోవైపు మాజీ మంత్రి చందూలాల్ తనయుడిగా లంబాడీ సామాజికవర్గ నేతగా ప్రహ్లాద్.. బీజేపీ అభ్యర్థిగా పోటీ పడుతుండడంతో ములుగులో హోరాహోరీ పోరుకు తెరలేచింది.
2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పిలుపుతో నక్సల్స్ ఉద్యమం నుంచి టీడీపీలో చేరి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సీతక్క (ధనసరి అనసూయ) ఆ ఎన్నికల్లో ఓడినా.. 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 2014లో ఓటమిపాలైనా.. నియోజకవర్గాన్నే అంటిపెట్టుకొని ఉన్నారు. ఆ తరువాత రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీ నుంచి కాంగ్రె్‌సలో చేరి 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విజయం సాధించారు. కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలతో సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కరోనా బాధితులకు వంటసామగ్రి, మందులను స్వయంగా తీసుకెళ్లి ఆదివాసీ గూడేల్లో పంపిణీ చేశారు. ములుగు సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడమే కాకుండా ఉన్నతాధికారులను కలిసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రజల్లో ఆదరణ పొందారు. కాంగ్రెస్ పార్టీలోనూ సీతక్కకు ప్రాధాన్యం పెరగడంతో ఏఐసీసీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రె్‌సకు బలమైన కోటగా ములుగు నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజ న్ కోసం పోరాడి సాధించడం, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండటం ఆమెకు కలిసివచ్చే అంశాలు కానున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా, సోదరిగా సీతక్కకు గుర్తింపు ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అత్యున్నత పదవి దక్కుతుంద నే ప్రచారం కూడా ఆమెకు కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు.
బీఆర్‌ఎస్ నాగాస్త్రం..
ములుగులో గులాబీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఉన్న బీఆర్‌ఎస్.. సీతక్కపై అదే సామాజికవర్గం, అదే నేపథ్యం ఉన్న మహిళా అభ్యర్థిని బరిలో దింపింది. మాజీ మావోయిస్టు దంపతులు బడే నాగేశ్వర్‌రావు అలియాస్ ప్రభాకర్, రాజేశ్వరి దంపతుల కుమార్తె నాగజ్యోతి. ఆమె చిన్నాన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర యాక్షన్ టీం కమిటీ కమాండర్‌గా, కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన నాగజ్యోతి.. ఆ గ్రామ సర్పంచ్‌గా 2019లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2019లో బీఆర్‌ఎ్‌సలో చేరి తాడ్వాయి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత జడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మృతి చెందడంతో నాగజ్యోతి జడ్పీ చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. బీఆర్‌ఎస్ తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సీతక్క మీడియాలో ప్రచారం కోసమే పనిచేస్తున్నారని, తనది పూరి గుడిసె అని, సీతక్క బంగ్లాలో ఉన్న ధనవంతురాలు అంటూ నాగజ్యోతి విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు.
లంబాడీ వర్గం నుంచి బీజేపీ అభ్యర్థి..
బీజేపీకి గతంలో పెద్దగా పట్టులేని ములుగు నియోజకవర్గంలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు ప్రత్యేక దృష్టి సారించడంతో కొంత ఓటుబ్యాంకు పెరిగింది. మాజీ మంత్రి, దివంగత చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్‌కు బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంతో ఆయన బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. దీంతో బీఆర్‌ఎ్‌సతో పాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు కొంత పెరిగాయి. ఆ పార్టీ కూడా వ్యూహాత్మకంగా లంబాడీ తెగకు చెందిన ప్రహ్లాద్‌ను బరిలో దించి తాము కూడా పోటీలో ఉన్నామనే సంకేతాలను పంపింది. అయితే ఇప్పటివరకు బీజేపీ మేనిఫెస్టో ప్రజల్లోకి రాకపోవడంతో ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలపైనే ఆధారపడి ప్రహ్లాద్ ప్రచారం నిర్వహిస్తున్నారు.
గిరిజనేతరుల ఓట్లే కీలకం!
ములుగు నియోజకవర్గంలో మొత్తం 2,26,366 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 45 వేలకు పైగా ఆదివాసీ ఓటర్లు ఉండగా, మరో 32 వేలకు పైగా లంబాడీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు. 2018 ఎన్నికల్లో సీతక్కకు ఆదివాసీ ఓటర్లు మద్దతుగా నిలవడంతోపాటు నాటి బీఆర్‌ఎస్ అభ్యర్థి చందూలాల్‌పై అసంతృప్తితో లంబాడీ వర్గానికి చెందిన నేతలు కూడా కొంతమంది ఆమెకు మద్దతు ప్రకటించారు. కానీ, ఈసారి సీతక్కకు పోటీగా ఆదివాసీ మహిళే ఉండడం, చందూలాల్ తనయుడు బీజేపీ నుంచి బరిలోకి దిగడంతో.. ఏ వర్గం ఓటర్లు ఎవరికి మద్దతు తెలుపుతారన్నది ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు ఈ నియోజకవర్గంలో గిరిజనేతర ఓటర్లు లక్షా 50 వేల మందికి పైగా ఉన్నారు. వీరిలో గోవిందరావుపేట, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో సెటిలర్లు ఓట్లు కూడా పెద్దసంఖ్యలో ఉన్నాయి. గిరిజనేతరుల ఓట్లు ఎవరి వైపు మొగ్గుచూపితే వారే గెలిచే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.