Share News

Nagam Janardhan Reddy: బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి.. కేటీఆర్ ఏం హామీ ఇచ్చారంటే..?

ABN , First Publish Date - 2023-10-29T22:04:57+05:30 IST

మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ( Nagam Janardhan Reddy ) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామాను కాంగ్రెస్ ( Congress ) అధిష్ఠానానికి పంపించారు.

Nagam Janardhan Reddy: బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి.. కేటీఆర్ ఏం హామీ ఇచ్చారంటే..?

హైదరాబాద్‌: మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ( Nagam Janardhan Reddy ) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామాను కాంగ్రెస్ ( Congress ) అధిష్ఠానానికి పంపించారు. నాగం జనార్దన్‌రెడ్డి రాజీనామా చేసిన వెంటనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాగం ఇంటికి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు వెళ్లి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నాగర్‌కర్నూల్‌ భవిష్యత్‌ కోసం BRSలో చేరుతునట్లు నాగం జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా నాగం జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈరోజు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేశా. నాకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగింది. ఈరోజు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. తొందరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీలో చేరతాను. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు నా మనస్సుకు ఎంతో బాధ అనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం మాత్రం గుండు సున్నానే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధ్వాన స్థితిలోకి వెళ్లింది. చేవెళ్ల కాంగ్రెస్‌ సభకు 50 వేల మందిని తరలించాం. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ తుంగలో తొక్కింది. డబ్బులు ఉన్నవారికే కాంగ్రెస్‌ టికెట్లు ఇచ్చింది. పార్టీ జెండాలు మోసిన వారికి కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వలేదు’’ అని నాగం జనార్దన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం: కేటీఆర్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ...‘‘కేసీఆర్‌కు అత్యంత మిత్రుడు ఆనాడు తెలంగాణ కోసం జైలుకెళ్లిన వ్యక్తి నాగం జనార్దన్‌రెడ్డి. ఈరోజు నాగం జనార్దన్‌రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకీ సాదరంగా ఆహ్వానించాము. బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉన్నత పదవి ఇస్తాం. నాగంని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుంది. రేపటి రోజున జరిగే ఎన్నికల్లో కలిసి కట్టుగా ముందుకు వెళ్తాం. మా నిర్ణయాన్ని నాగం జనార్దన్‌రెడ్డి స్వాగతించారు’’ అని కేటీఆర్ తెలిపారు. నాగం జనార్దన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంతో ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. నాగంలో పాటే మరికొంతమంది అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి మార్గం సుగమం చేసుకుంటున్నట్లు విశ్వాసనీయ సమాచారం. నాగరం కాంగ్రెస్ పార్టీని వీడడంతో నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ పార్టీకి కొంతమేర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-10-29T22:05:29+05:30 IST