Share News

Pawan Kalyan: వరంగల్ పోరాట స్ఫూర్తితోనే ఆంధ్రాలో గూండాల పాలనను తట్టుకుంటున్నా..

ABN , First Publish Date - 2023-11-22T16:15:40+05:30 IST

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

Pawan Kalyan: వరంగల్ పోరాట స్ఫూర్తితోనే ఆంధ్రాలో గూండాల పాలనను తట్టుకుంటున్నా..

హనుమకొండ: ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని, గూండాల పాలన నడుస్తోందని, అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం వరంగల్ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.


‘‘తెలంగాణ నా గుండెచప్ఫుడు. ఇకపై తెలంగాణలోనూ అడుగుపెడుతున్నాను. తెలంగాణ ధైర్యంతోనే ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నాను’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jansena Chief Pawan Kalyan) అన్నారు.

బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదని పవన్ కల్యాణ్ అన్నారు. కమీషన్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందని అన్నారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని అన్నారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నానని... వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతాను అని జనసేనాని స్పష్టం చేశారు.


బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానన్నారు. తెలంగాణలో జనసేన (Janasena) ఉంటుందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు. 2009లో స్థాపించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని చెప్పుకొచ్చారు. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తాను ఒకడిని అని అన్నారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని కోరారు. సమస్యలొస్తే తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని.. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని అందుకే బీజేపీతో కలిసినట్లు తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గెలిపించాలని కోరారు. అన్ని నియోజకవర్గాల్లో జనసేన - బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

Updated Date - 2023-11-22T17:01:07+05:30 IST