Union Minister: కేసీఆర్, కవితపై అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-11-04T16:11:26+05:30 IST
బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని.. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుందన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియానే విడిచిపెట్టలేదని.. కవితను ఎలా విడిచిపెడతామంటూ సంచలన కామెంట్స్ చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (Union Minister Anurag Thakur) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని.. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుందన్నారు. లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియానే (Delhi Deputy CM Sisodia) విడిచిపెట్టలేదని.. కవితను ఎలా విడిచిపెడతామంటూ సంచలన కామెంట్స్ చేశారు. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. జాతీయ రాజకీయాలు కేసీఆర్ చేద్దామనుకుంటే.. లిక్కర్ కేసులో కవిత జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు కేసీఆర్ అంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్ ..
గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్ అని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజక్ట్‌లో కరప్షన్ జరిగినట్లు కేటీఆర్ ఒప్పుకుంటున్నారని.. అవినీతి ఎంత జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్‌ను అడిగి చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేసీఆర్ నీకు దమ్ముంటే గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, డబుల్ ఇండ్లు, ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయి’’ అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ గ్యారెంటీలు వర్కవుట్ అవ్వడం లేదని.. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు అంటూ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ ఆలస్యం చేయడంతో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారన్నారు. వరల్డ్ కప్‌లో ఇండియన్ టీం అద్భుతమైన ప్రదర్శన చేస్తోందని.. అలాగే తెలంగాణ ఎన్నికల సందర్భంగా బ్యాట్స్ మెన్‌గా తనను తెలంగాణకు పంపించారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.