Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీస్‌పై బండి సంజయ్‌ స్పందన.. మంత్రిని బర్తరఫ్ చేసేదాకా పోరాటం

ABN , First Publish Date - 2023-03-29T18:56:03+05:30 IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ పంపించిన లీగల్ నోటీస్‌పై (KTR legal notices) తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) స్పందించారు.

Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీస్‌పై బండి సంజయ్‌ స్పందన.. మంత్రిని బర్తరఫ్ చేసేదాకా పోరాటం

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ పంపించిన లీగల్ నోటీస్‌పై (KTR legal notices) తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) స్పందించారు. మంత్రి కేటీఆర్‌ పరువుకే రూ.100 కోట్లయితే 30 లక్షల మంది యువతకు ఎంత మూల్యం చెల్లిస్తారు?, పేపర్ లీక్‌లో తన కుట్ర ఉందన్న కేటీఆర్‌పై ఎంతకు దావా వేయాలి? అని సంజయ్‌ ప్రశ్నించారు. కేటీఆర్‌ ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని, మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేసేదాకా పోరాటం చేస్తామని సంజయ్ స్పష్టం చేశారు. కేటీఆర్‌ నోటీసులపై లీగల్‌గానే ఎదుర్కొంటామని బండి సంజయ్ అన్నారు. పేపర్‌ లీక్‌పై సిట్టింగ్‌ జడ్జితో విచారించాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి (Revanth Reddy), తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఒక్క దురదృష్టకర సంఘటనను బూచిగా చూపి మొత్తం నియామకాల ప్రక్రియను ఆపేయాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ కుతంత్రమని మండిపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరు ప్రభుత్వం వేరు అన్న ఇంగిత జ్ఞానం లేని అజ్ఞానులు అంటూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ను ఉద్దేశిస్తూ కేటీఆర్ విమర్శించారు. వెకిలి మకిలి ఆరోపణలతో బట్టగాల్చి మీదేసే చిల్లర ప్రయత్నాలను సహించేది లేదని, మతిలేని మాటలు మాట్లాడుతున్న పిచ్చి నేతల రాజకీయ ఉచ్చులో యువత చిక్కుకోవద్దని కేటీఆర్ సూచించారు. ఉద్యోగాల ప్రిపరేషన్‌ను కొనసాగించాలని యువతకు మంత్రి కేటిఆర్ విజ్ఞప్తి చేశారు.

టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీపై విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని సిట్ తెలిపింది. ఒకే మండలంలో వంద మందికి 100 మార్కులు వచ్చినట్లు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఆరోపణలపై రేవంత్ ఆధారాలు సమర్పించలేదని సిట్ అధికారులు పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT) సిద్ధపడుతోంది. న్యాయపరమైన సలహాలు తీసుకొని రేవంత్‌పై చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2023-03-29T18:56:10+05:30 IST