TS Elections Results: సీఎం పదవి ఇస్తే స్వీకరిస్తా.. గురి తప్పింది అంతే..
ABN , First Publish Date - 2023-12-03T16:05:03+05:30 IST
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ ఇచ్చామనే పేరు ఉన్నప్పటికీ దాదాపు 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీ తొలి సారి రాష్ట్రంలో పాలనను చేపట్టబోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ ఇచ్చామనే పేరు ఉన్నప్పటికీ దాదాపు 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీ తొలి సారి రాష్ట్రంలో పాలనను చేపట్టబోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడిన ఓటర్లు హస్తం పార్టీని గద్దెనెక్కించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇక పాలనను మొదలుపెట్టడమే మిగిలి ఉంది. దీంతో ఊరువాడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహం నెలకొంది. కార్యకర్తలు, నేతలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విజయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు.
తెలంగాణలో దొరల పాలన పోయిందని, ప్రజల తెలంగాణ వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గెలిచిన అభర్థులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ తరఫున ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. అటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఓటమిని అంగీకరించిన ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఆయన అభినందనలు తెలిపారు. మీకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అలాగే తమకు రెండు సార్లు అవకాశమిచ్చిన తెలంగాణ ఓటర్లకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ రోజు వచ్చిన ఫలితాలను చూసి మేము బాధపడడం లేదు. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాం. అయితే ఈ ఓటమి నుంచి మేము నేర్చుకుంటాం. తిరిగి బలంగా పుంజుకుంటాం. హ్యాట్రిక్ సాధిస్తామన్న మా గురి తప్పింది. దీనికి వయస్సు అయిపోదు... గురి తప్పింది అంతే’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.