BJP to BRS: బీజేపీకి షాక్.. బీఆర్‌ఎస్‌లో చేరబోతున్న మాజీమంత్రి తనయుడు
ABN , First Publish Date - 2023-08-23T11:39:59+05:30 IST
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతు న్నాయని,
కొత్తగూడెం, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతు న్నాయని, ఇందులో తాను భాగస్వామ్యమయ్యేందుకు సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నానని కోనేరు సత్యనారాయణ(చిన్ని)(Koneru Satyanarayana) తెలిపారు. మంగళవారం కొత్తగూడెంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన తాను బీజేపీకి గుడ్‌బై చెప్పినట్టు స్పష్టం చేశారు. తనను బీజేపీ తనను ఎంతో గౌరవించి జిల్లా బాధ్యతలు అప్పగించిందని.. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పార్టీ అధికారం ఏర్పాటు చేసే పరిస్థితి లేదని, అన్నివర్గాలకు సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నానన్నారు. కాంగ్రెస్‌తో ఒరిగిందేమీ లేదని, మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారమన్నారు. తన తండ్రి మాజీమంత్రి, దివంగత నేత కోనేరు నాగేశ్వరరావు(Koneru Nageswara Rao)కు సీఎం కేసీఆర్ ఉన్న మిత్రబంధం నేపథ్యంలో తనను కేసీఆర్ ఆహ్వానించారన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారానికి, ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.
బలపడాలనుకున్న బీజేపీకి షాక్
వచ్చేఎన్నికలే లక్ష్యంగా ఉమ్మడిజిల్లాలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి షాక్ తగిలింది. కోనేరు చిన్ని ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో కేడర్‌లో నైరాశ్యం నెలకొంది. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చిన్ని ఓటమి పాలయ్యారు. 2018లో మహాకూటమి పొత్తులో భాగంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చారు. ఆ తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరి రెండేళ్లుగా భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ 27న ఖమ్మంలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా బహిరంగసభ జరగనున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోనేరు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే కోనేరు చిన్ని సోమవారం సీఎం కేసీఆర్‌ను కలవడంతో.. ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేంద్రరెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.