Share News

Election Results: తండ్రి కలను నెరవేర్చిన కొడుకు.. ఎవరా అభ్యర్థి? ఏమా కథ?

ABN , First Publish Date - 2023-12-04T11:16:21+05:30 IST

ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కౌంటింగ్ ఆరంభం నుంచే అధిక్యంలో నిలిచిన కాంగ్రెస్ చివరి వరకు అదే ఊపును కొనసాగించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన అనేక మంది కొత్త అభ్యర్థులు గెలిచారు.

Election Results: తండ్రి కలను నెరవేర్చిన కొడుకు.. ఎవరా అభ్యర్థి? ఏమా కథ?

నాగర్‌కర్నూల్: ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కౌంటింగ్ ఆరంభం నుంచే అధిక్యంలో నిలిచిన కాంగ్రెస్ చివరి వరకు అదే ఊపును కొనసాగించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన అనేక మంది కొత్త అభ్యర్థులు గెలిచారు. ఈ క్రమంలోనే ఓ అభ్యర్థి రెండున్నర దశాబ్దాల తండ్రి కలను నెరవేర్చారు. దాదాపుగా పాతికేళ్లుగా తండ్రికి సాధ్యం కానీ విజయాన్ని ఆయన సాధించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అందని ద్రాక్షగా ఉన్న విజయాన్ని కొడుకు తొలి ప్రయత్నంలోనే అందుకోని తండ్రి చిరకాల కోరికను నెరవేర్చారు. ఆయన ఎవరో కాదు. సీనియర్ నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి. ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డిపై 5,371 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్వతహాగా డాక్టర్ అయినా రాజేష్ రెడ్డి పోటీ చేసిన మొదటి ప్రయత్నంలోనే 87,161 ఓట్లు సాధించి జయకేతనం ఎగురవేశారు. దీంతో ఆయన తొలిసారి శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు.


కాగా కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తండ్రి దామోదర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయనకు 40 ఏళ్లకుపైగా రాజకీయం అనుభవం ఉంది. 1980వ దశకం నుంచే దామోదర్ రెడ్డి రాజకీయం జీవితం ఆరంభమైంది. 1981 నుంచి 1991వరకు తూడుకుర్తి గ్రామ సర్పంచ్‌గా, 1991 నుంచి 1996వరకు ఎంపీపీగా పనిచేశారు. 2015లో తొలిసారి శాసనమండలికి ఎన్నియ్యారు. 2021లోనూ మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు. 2019 సెప్టెంబర్ 7న బీఆర్‌ఎస్ పార్టీ ఆయనను ప్రభుత్వ విప్‌గా నియమించింది. కానీ ఎమ్మెల్యే పదవి మాత్రం దామోదర్ రెడ్డికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 5 సార్లు పోటీలో నిలిచినా ఎమ్మెల్యే కావాలనే కోరిక మాత్రం నెరవేరలేదు. 1999, 2004, 2009, 2012, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి దామోదర్ రెడ్డి పోటీ చేశారు. కానీ కనీసం ఒక్కటంటే ఒకసారి కూడా గెలవలేకపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా సాగిన 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు నిరాశే మిగిలింది. ఏకంగా నాలుగు సార్లు నాగం జనార్దన్ రెడ్డి చేతుల్లో ఓడిపోవడం గమనార్హం. 2014లో మర్రి జనార్దన్ రెడ్డి చేతిలోనూ ఓడిపోయారు. దీంతో ఎమ్మెల్యే కావాలనే దామోదర్ రెడ్డి చిరకాల కోరిక కలగానే మిగిలిపోయింది.

కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులు మారుతుంటాయి. దామోదర్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది. దామోదర్ రెడ్డి వల్ల కానీది ఆయన కొడుకు రాజేష్ రెడ్డి చేసి చూపించారు. అది కూడా తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచి అందరితో శభాష్ అనిపించుకున్నారు. రెండున్నర దశాబ్దాల తండ్రి కోరికను నెరవేర్చి ఆయన కళ్లల్లో సంతోషాన్ని నింపారు. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దామోదర్ రెడ్డి, రాజేష్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. కానీ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది రాజేష్ రెడ్డికి బాగా కలిసొచ్చింది. కానీ పార్టీ టికెట్ లభించాక, అప్పటికే నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్దర్ రెడ్డి.. రాజేష్ రెడ్డి పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనకు టికెట్ ఇవ్వలేదనే కోపంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. మర్రి జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి కలయికతో బీఆర్‌ఎస్ బలం పెరిగింది. దీంతో రాజేష్ రెడ్డి గెలుపు అసాధ్యమని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ పట్టువిడకుండా పోరాడిన రాజేష్ రెడ్డి.. సీనియర్లైన మర్రి జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డిని ఓడించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేగా అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-04T11:16:28+05:30 IST