TS Assembly: అందుకు చాలా బాధగా ఉంది... అసెంబ్లీలో రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2023-08-06T11:43:30+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TS Assembly session) మూడవ రోజైన ఆదివారం మొదలయ్యాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదని, తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందన్నారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

TS Assembly: అందుకు చాలా బాధగా ఉంది... అసెంబ్లీలో రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TS Assembly session) మూడవ రోజైన ఆదివారం మొదలయ్యాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ వచ్చే ఎన్నికల్లో నా స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదు. నేను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉంది. నేను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా నా చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. నా సొంత వారు, బయటి వారు నన్ను రాకుండా చేయాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం. నేను ఉన్నా లేకున్నా నా గోషామహల్ నియోజకవర్గ ప్రజలపై మీరు దయ చూపాలని నా ప్రార్థన..’’ అంటూ ఒకింత ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.


ప్రభుత్వం గోషామహల్ నియోజకవర్గాన్ని విస్మరించడం బాధాకరంగా ఉందని రాజాసింగ్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గానికి తాను ఎంతో చేశానని చెప్పారు. నియోజకవర్గ సమస్యలు, తన పరిధిలో లేని పనులు, ప్రభుత్వం చేయాల్సిన పనుల కోసం తాను ఎన్నికైన నాటి నుంచి అనేక వేదికల మీద, అన్ని అసెంబ్లీ సమావేశాల్లో వివరించానని ప్రస్తావించారు. కాగా ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాటి నుంచి ఆయన బీజేపీకి దూరంగా ఉంటున్నారు. కొంతకాలం గడిచాక సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావించినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. అయితే.. ఈమధ్య బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ అవ్వడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని రాజాసింగ్ కొట్టిపారేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు (ఆదివారం) అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Updated Date - 2023-08-06T11:45:00+05:30 IST