Venkat Rao Trust Lands: ‘ట్రస్టు భూములు హాంఫట్!
ABN , First Publish Date - 2023-08-18T03:56:34+05:30 IST
కొందరు భూ బకాసురుల దాహానికి ఓ పెద్దాయన ఉదాత్తమైన ఆలోచనకు గండిపడుతోంది. నిరుపేద విద్యార్థుల కోసం ఓ పాఠశాలను ఏర్పాటు చేయడమే కాదు..
రంగారెడ్డి జిల్లా నందిగామలో 102 ఎకరాల వెంకట్‌రావు ట్రస్టు భూమిపై కన్ను
1938లో లాల్‌దర్వాజాలో పాఠశాల కట్టించిన ఓ భూస్వామి
ఆపై 102 ఎకరాలు కేటాయింపు.. 1940లో ట్రస్టు ఏర్పాటు
నిర్వహణ భారమైనప్పుడు విక్రయించొచ్చని బైలా్‌సలో స్పష్టం
2007లో 60% భూమిని 1.7 కోట్లకు అమ్మేందుకు ఎంవోయూ
ట్రస్టులో జమకాని డబ్బు? చైర్మన్ దుర్వినియోగపర్చినట్లు ఆరోపణ
సిటీ సివిల్ కోర్టుకు సభ్యులు.. భూములపై హైకోర్టు స్టేట్‌స-కో
అయినా 35 ఎకరాలు రిజిస్ట్రేషన్.. దీనివెనుక రాజకీయ నేతలు?
స్టేట్‌స-కో ప్రతిని తహసీల్దార్‌కు అందజేసిన ట్రస్టు సభ్యులు
రంగారెడ్డి అర్బన్/షాద్‌నగర్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కొందరు భూ బకాసురుల దాహానికి ఓ పెద్దాయన ఉదాత్తమైన ఆలోచనకు గండిపడుతోంది. నిరుపేద విద్యార్థుల కోసం ఓ పాఠశాలను ఏర్పాటు చేయడమే కాదు.. దాని నిర్వహణ పరంగా దన్నుగా ఉండేందుకు అప్పట్లోనే తన భూముల్లోంచి 102 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారు. తర్వాత రెండేళ్లకు ఆ భూస్వామి తన కుమారుడి పేరు మీద ఓ ట్రస్టు ఏర్పాటు చేసి బడి కోసం ఇచ్చిన భూమిని ట్రస్టు కిందకు చేర్చారు. వందల కోట్ల విలువ చేసే ఆ భూములపై రాజకీయ నేతల కన్నుపడింది. అంతేనా.. ఆ భూముల్లోంచి నెల క్రితమే 35.01 ఎకరాలు అన్యాక్రాంతమైపోయాయి కూడా! ఈ భూములను అమ్మరాదు అంటూ హైకోర్టు (High Court)స్టేట్‌స-కో ఇచ్చినా కూడా రెవెన్యూ అధికారుల అండదండలతో భూమిని గుట్టుచప్పుడు కాకుండా కొందరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు! ఇదంతా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి అనుకొని ఉన్న ‘వెంకట్ రావు ట్రస్టు’ భూముల('Venkat Rao Trust' lands) వ్యవహారం! గుండేరావు పాంపాడ్ అనే వ్యక్తి, తన కుమారుడి స్మారకార్థం హైదరాబాద్‌లో పాతబస్తీలోని లాల్‌దర్వాజ ప్రాంతంలో 1938లో వెంకట్‌రావు మెమోరియల్ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా పాఠశాల సాఫీగా సాగాలనే ఉద్దేశంతో 102 ఎకరాలనూ అప్పగించారు.
తర్వాత రెండేళ్లకు.. 1940లో ఆయన కుమారుడు వెంకట్‌రావు పేరుతో ఓ ట్రస్టు ఏర్పాటు చేసి ఈ భూమి అంతా ట్రస్టు కిందకు చేర్చారు. బడి నిర్వహణ పరంగా ఆర్థికపరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఈ భూమిలోంచి కొంత విక్రయించుకోవచ్చని ట్రస్టు బైలాస్‌లో అప్పట్లోనే రాసుకున్నారు. దీని ప్రకారమే 2007లో ట్రస్టు భూముల్లోంచి 60శాతం భూమిని ట్రస్టు సభ్యుడైన డీడీ గిరితో పాటు ఎంవీఎల్ నర్సింహారావు, ఎం.శ్రీనివాస్, డాక్టర్ డీవీ వరప్రసాద్‌కు విక్రయించేందుకు ట్రసు ఏంవోయూ కుదుర్చుకొని రూ.1.7కోట్లు తీసుకుంది. ఈ డబ్బు విషయంలో ట్రస్టు సభ్యుల మఽధ్య వివాదం నెలకొంది. ట్రస్టులో జమచేయాల్సిన ఈ డబ్బును అప్పట్లో ట్రస్టు అధ్యక్షుడిగా ఉన్న నితీశ్ హర్వాల్‌కర్ దుర్వినియోగం చేసినట్లుగా ట్రస్టులోని సభ్యులే ఆరోపించారు. ఈ వ్యవహారంపై ట్రస్టు సభ్యుడైన గుండాల్‌రెడ్డితో పాటు మరికొందరు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ట్రస్టు కొనసాగుతుండగానే సభ్యులకు సమాచారమివ్వకుండా చైర్మన్, కొత్త ట్రస్టును ఏర్పాటు చేశారు. తనకు అనుకూలంగా ఉన్న వారిని సభ్యులుగా చేర్చుకున్నారు. దీనిపై అసలు సభ్యులు డీడీ.గిరి, గుండాల్‌రెడ్డి 2023 ఏప్రిల్ 10న హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం ట్రస్టు పేరిట ఉన్న భూములపై స్టేట్‌సకో ఇచ్చింది.
ఈ భూములకు సంబంధించి షాద్‌నగర్ కోర్టులో కేసు కొనసాగుతున్నందున అక్కడ తీర్పు ఇచ్చే వరకు తామిచ్చిన స్టేట్‌స-కో అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. స్టేట్‌సకో కాపీని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు షాద్‌నగర్ ఆర్డీవో, నందిగామ తహసీల్దార్ కార్యాలయాల్లో ట్రస్టు సభ్యులు అందజేశారు. అయినప్పటికీ... సర్వే నెంబర్లు 1275, 1276లలోని 35.01ఎకరాల భూమిని ‘ఫోర్ ఎస్ ఎంటర్‌ప్రైజెస్’ పేరిట 2023 జూలై 12న రిజిస్ట్రేషన్ చేశారు. మార్కెట్ ధర ప్రకారం అమ్మిన భూమి విలువ వంద కోట్ల పైమాటే. రాజకీయ నేతల ఒత్తిడితోనే రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్‌కు సహకరించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై ట్రస్టు సభ్యులు, పొలం అనుభవదారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. స్టేట్‌సకోను పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మే నెలలోనే ట్రస్టు భూముల్లోంచి 12ఎకరాలను కొందరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. మిగతా భూములను అమ్మేందుకు ప్రయత్నిన్నారని ట్రస్టు సభ్యులు ఆరోపిస్తున్నారు.
ట్రస్టు ఖాతాలో రూ.1.7కోట్లు జమ చేయలేదు?
స్కూల్ అవసరాల కోసం ట్రస్టు భూముల్లోంచి 60శాతం భూమిని రూ.1.7కోట్లకు అమ్మేందుకు డీడీ గిరితో పాటు మరికొందరు ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఆ డబ్బులను చెక్కు, డీడీల రూపంలోనే చెల్లించారు. కానీ ట్రస్టుకు ఖాతాలో జమ చేయాల్సిన డబ్బులను ట్రస్టు ప్రెసిడెంట్ నితీశ్ హరాల్‌కర్ దుర్వినియోగం చేశారు. దీంతో మేం కోర్టును ఆశ్రయించాం. నేను కూడా ట్రస్టు సభ్యుడినే. నన్ను సంప్రదించకుండా మరో ట్రస్టును ఏర్పాటు చేసి 35 ఎకరాలను రాత్రికి రాత్రే ఓ సంస్థకు అమ్మేశారు. రూ.120కోట్లు విలువ చేసే భూములను 12కోట్లకు అమ్మినట్లు డాక్యుమెంట్‌లో చూపించారు. హైకోర్టు స్టేట్‌సకో ఉన్న రిజిస్ట్రేషన్ చేయడం అంటే.. కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించడమే.
- ఎల్.గుండాల్‌రెడ్డి, ట్రస్టు సభ్యుడు, ఎక్సైజ్ శాఖ రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్
స్టేట్‌సకో ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు
నందిగామ మండలంలో జాతీయ రహదారికి ఆనుకుని సర్వే నెంబర్లు 1970 నుంచి 1982 వరకు ఉన్న 102 ఎకరాలన్నీ ట్రస్టు భూములే. ట్రస్టు అవసరాల కోసం 60శాతం భూమిని అమ్మాలనుకున్నాం. ఈ భూమిని నేను కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా. 2007 మార్కెట్ ధర ప్రకారం ఒప్పందం కుదుర్చుకుని రూ.1.7కోట్లు ట్రస్టు ప్రెసిడెంట్ నితీశ్ హరాల్‌కర్ ఇచ్చాను. ట్రస్టు సభ్యులకు తెలియకుండానే కొత్త ట్రస్టు ఏర్పాటు చేశాడు. దీంతో మేం హైకోర్టును ఆశ్రయించి స్టేట్‌సకో తెచ్చాం. ట్రస్ట్ భూమిని ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయొద్దని..ఆన్‌లైన్‌లో టీఎం-26ఫారాన్ని పూర్తిచేసి కలెక్టర్‌కు పంపించాం. ఈ ఏడాది జూలై 12న రాత్రికి రాత్రే డిప్యుటీ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారు.
- డీడీ గిరి, ట్రస్టు సభ్యుడు
విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం
నేను తహసీల్దార్‌గా చార్జ్ తీసుకొని మూడు రోజులైంది. ట్రస్టు భూములపై కోర్టు స్టేట్‌సకో ఉన్న విషయం నా దృష్టికొచ్చింది. ట్రస్టు సభ్యుల నుంచి ఫిర్యాదు అందింది. ఎవరికి రిజిస్ట్రేషన్ అయింది.. ఎందుకు చేశారో అనే అంశాలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. - అయ్యప్ప, తహసీల్దార్, నందిగామ
స్లాట్ బుక్ కావడంతోనే రిజిస్ట్రేషన్
కోర్టు స్టేట్‌సకో ధరణిలో నమోదు కాలేదు. ట్రస్ట్ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇటీవలే స్లాట్ బుక్ చేశారు. దీంతో మేము రిజిస్ట్రేషన్ చేశాం. మధ్యాహ్నం సమయంలో స్లాట్ బుక్ అయి ఉన్నా.. సర్వర్ బిజీగా ఉండటంసాయంత్రం పూర్తి చేశాం.
- విజయ్‌కుమార్, డిప్యుటీ తహసీల్దార్, నందిగామ