Viveka Murder Case : వివేకా కేసులో అజేయ కల్లం బిగ్ ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-07-29T11:44:24+05:30 IST

వివేకా హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టులో ఆయన నేడు రిట్‌ పిటిషన్‌ వేశారు. వివేకా హత్య కేసుపై సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని అజేయ కల్లం పేర్కొన్నారు. ఏప్రిల్‌ 29, 2023న సీబీఐ తన నుంచి స్టేట్‌మెంట్‌‌ను రికార్డు చేసిందని తెలిపారు. తాను చెప్పింది ఒకటైతే సీబీఐ దాన్ని మార్చి చార్జిషీటులో మరోలా పేర్కొందని అజేయకల్లం పిటిషన్‌లో వెల్లడించారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని ఆయన కోరారు.

Viveka Murder Case : వివేకా కేసులో అజేయ కల్లం బిగ్ ట్విస్ట్..

హైదరాబాద్ : వివేకా హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టులో ఆయన నేడు రిట్‌ పిటిషన్‌ వేశారు. వివేకా హత్య కేసుపై సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని అజేయ కల్లం పేర్కొన్నారు. ఏప్రిల్‌ 29, 2023న సీబీఐ తన నుంచి స్టేట్‌మెంట్‌‌ను రికార్డు చేసిందని తెలిపారు. తాను చెప్పింది ఒకటైతే సీబీఐ దాన్ని మార్చి చార్జిషీటులో మరోలా పేర్కొందని అజేయకల్లం పిటిషన్‌లో వెల్లడించారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని ఆయన కోరారు.

కాగా.. అసలు వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో.. దానినే సీబీఐకి వివరించినట్టు అజేయ కల్లం తెలిపారు. ‘‘మార్చి 15, 2019న జగన్‌ నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్‌ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్‌ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు. ఇంతకు మించి నేనేమీ సీబీఐకి చెప్పలేదు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే సీబీఐ తన చార్జిషీటులో దీన్ని మొత్తాన్ని మార్చివేసిందన్నారు. తానసలు జగన్ భార్య ప్రస్తావన కానీ.. మరే ఇతర ప్రస్తావన కానీ సీబీఐ విచారణలో తీసుకురాలేదన్నారు. సీబీఐ తాను చెప్పినట్టుగా పేర్కొన్న చార్జిషీట్‌లో అన్నీ అబద్ధాలే ఉన్నాయన్నారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోందన్నారు. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్‌మెంట్‌గా పేర్కొన్న అంశాలను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ అజేయ కల్లం పిటిషన్ వేశారు.

అజేయ కల్లం పదవీ కాలం పొడగింపు వెనుక కారణమదేనా?

కాగా ఇటీవలి కాలంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం రిటైర్‌మెంట్ అనంతరం ఆయనను ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించింది. అయితే ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పటికీ చాలా కాలం పాటు పాలనా వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఆయనకు కేటాయించిన ఛాంబర్‌కు కూడా వెళ్లడం లేదంటూ అప్పట్లో టాక్ నడిచింది. కొంతకాలంగా గడ్డంతో కనిపిస్తున్న ఆయన ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లించారట. తాడేపల్లి వైపు తలెత్తి కూడా చూడటం లేదని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ కల్లం వార్షిత వేతనం 30 లక్షల వరకూ ఉందని తెలిసింది. అంత వేతనం పొందుతున్నప్పటికీ అజేయ కల్లం అలక్ష్యం వహించారు. అలాంటి అజేయ కల్లాం పదవీ కాలాన్ని గత నెల 15న తిరిగి పొడిగించారు. దీని వెనుక పెద్ద కథే ఉందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

వివేకా హత్య 2019 మార్చి 15 అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో జరిగింది. అదేరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసమై నలుగురు ముఖ్యులను జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. వారిలో అజేయ కల్లం ఒకరు. తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఆ నలుగురితో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇంతలోనే మేడ మీద నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఇంట్లోకి వెళ్లిన జగన్ రెడ్డి పది నిమిషాల తర్వాత తిరిగి సమావేశ ప్రదేశానికి వచ్చారు. చిన్నాన్న గుండెపోటుతో చనిపోయారని ఆ నలుగురికీ చెప్పి సమావేశాన్ని కొనసాగించారు. అంటే, వివేకా హత్య గురించి ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి దంపతులకు తెలుసునని స్పష్టమవుతోంది. అజేయ కల్లంను పక్కనపెట్టేస్తే పొరపాటున వివేకా హత్య గురించి నోరు విప్పితే వైసీపీకి రాజకీయంగా భారీ నష్టం తప్పదు కాబట్టి.. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకున్న సీఎం జగన్ రెడ్డి అజేయ కల్లం రెడ్డికి పదవీ కాలాన్ని పొడిగించి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. ఇప్పుడు అజేయ కల్లం పిటిషన్ వెనుక మతలబు ఏంటో తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-07-29T11:44:24+05:30 IST