AP CID Raids: మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు
ABN , First Publish Date - 2023-02-24T12:24:38+05:30 IST
మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది.
హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణ (Former Minster Narayana) కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు (AP CID Raids) నిర్వహిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లిలోని ఇళ్లలో అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు నారాయణ (Narayana) ను టార్గెట్ చేసి పలు కేసులు నమోదు చేసి.. సోదాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నారాయణ కుమార్తెను అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. సీఐడీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు నారాయణపై ఏపీ సీఐడీ అధికారులు పలు కేసులు పెట్టారు. అయితే ఏ కేసులో నారాయణ కుమార్తె నివాసంలో అధికారులు సోదాలు చేపడుతున్నారనే విషయంలో స్పష్టత లేదు.
నారాయణపై పదోతరగతి పరీక్షాపత్రం లీకేజీ (10th class exam paper leakage)తో పాటు, అమరావతి రాజధాని భూముల (Capital lands of Amaravati)కు సంబంధించి కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో భాగంగా సీఐడీ అధికారులు (CID Officers) పలుమార్లు నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తాజాగా నారాయణ ఇళ్లలో సోదాలు ముగిసిన అనంతరం ఆయన కుమార్తెలను ఏపీ సీఐడీ అధికారులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి సోదాలు చేస్తున్న అధికారులు పలు రికార్డలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలోనే నారాయణ కుమార్తె ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు (AP CID) సోదాలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఇక టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే నారాయణను ప్రశ్నించడంతో పాటు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న నారాయణ ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యప్తు చేస్తున్న సీఐడీ అధికారులు మరోసారి నారాయణ కుమార్తె ఇళ్లల్లో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఏ విషయానికి సంబంధించి నారాయణ కుమార్తె ఇళ్లలో సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారనే అంశంపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.