BJP Leader: మొదట ఆ తండ్రీకొడులకు సిట్ నోటీసులు ఇవ్వాలి.. బండి సంజయ్ ఫైర్
ABN , First Publish Date - 2023-03-22T12:37:29+05:30 IST
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ సిట్ జారీ చేసిన నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage)పై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ సిట్ (SIT Notice) జారీ చేసిన నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మొదట ముఖ్యమంత్రి, ఆయన కొడుకుకు సిట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిలియన్ మార్చ్ తరహా.. నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. గతంలో అటుకులు తిన్న కేసీఆర్ కుటుంబాని (KCR Family)కి వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే తన దగ్గరున్న సమాచారాన్ని అందజేస్తానని తెలిపారు. సిట్ నోటీసులు ఇస్తే.. భయపడతామా? అని అన్నారు. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా విఫలమైన కేటీఆర్ (Minister KTR) ఎందుకు రాజీనామా చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తన కుటుంబం కోసం.. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలపై కేసీఆర్ ఉక్కుపాదం మోపారని ఆయన విమర్శించారు.
పేపర్ లీకేజీపై మాట్లాడిన అనేక మంది మంత్రులకు సిట్ నోటీసులు ఎందుకు జారీ చేయడంలేదని నిలదీశారు. బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం బిడ్డ కోసం క్యాబినెట్ అంతా ఢిల్లీలో కూర్చోవటం దారుణమన్నారు. 30 లక్షల మంది జీవితాలను కేసీఆర్ సర్కార్ (KCR Government) రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సహా.. ప్రతిపక్షాలన్నీ ప్రజల నుంచి వచ్చిన సమాచారంతోనే మాట్లాడుతామని తెలిపారు. తప్పు చేస్తే కేసులు పెట్టుకోవచ్చు.. కానీ జర్నలిస్ట్‌లపై దాడులను ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టుల కుటుంబాలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మీడియాను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ (Telangana) లో సీఎం కేసీఆర్ డౌన్ ఫాల్ మొదలైందన్నారు. అన్ని శాఖలకు మంత్రిగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.