Bandi Sanjay: తెలంగాణలో 13 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి హర్షణీయం
ABN , First Publish Date - 2023-06-09T11:42:57+05:30 IST
రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల (Medical Collages) ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుక్ ఎల్.మాండవీయకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు.
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం విషయంలో కేంద్రం ప్రత్యేక నిధులిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రజల పట్ల మోదీకి ఉన్న అభిమానంతో తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రం సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. కేంద్ర నిధులతో తెలంగాణలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ నాటి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ స్వయంగా లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈ విషయంలో సైంధవుడులా అడ్డుకున్న కేసీఆర్ తిరిగి కేంద్రం సహకరించలేదనడం సిగ్గు చేటని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.