Etela Rajender: మమ్మల్ని బీఏసీకి పిలవట్లేద్దు.. స్పీకర్‌ను అడిగినప్పటీకీ..

ABN , First Publish Date - 2023-08-03T14:02:22+05:30 IST

బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు.

Etela Rajender: మమ్మల్ని బీఏసీకి పిలవట్లేద్దు.. స్పీకర్‌ను అడిగినప్పటీకీ..

హైదరాబాద్: బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Etela Rajender) మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క సభ్యుడన్న లోక్ సత్తాను కూడా బీఏసీకి పిలిచేవారని గుర్తుచేశారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి... తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు సభ్యులున్న బీజేపీకి బీఏసీకి ఆహ్వానం లేదన్నారు. గతంలో శాసనసభ ఆవరణలో అన్ని పార్టీలకు ఆఫీసుల కోసం గదులు ఉండేవని.. ప్రస్తుతం మాకు శాసనసభాపక్షం కార్యాలయాలు ఇవ్వలేదని తెలిపారు. ఇది అత్యంత అవమానకర చర్య అని వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం స్పీకర్‌కు ఫోన్ చేసి.. తాము ఎక్కడుండాలని అడిగితే స్పందన లేదన్నారు. నిజాం క్లబ్‌లో కూర్చొని సమావేశాలకు రావాల్సి వచ్చిందన్నారు. మూడు రోజులు మాత్రమే సభను జరపటం సిగ్గుచేటన్నారు. 6 నెలలకు ఒకసారి సభ జరగాలి కాబట్టి నిర్వహిస్తున్నారు తప్ప.. ప్రభుత్వానికి ప్రజా సమస్యలు చర్చించాలన్న సోయి లేదని విమర్శించారు. వరదలతో లక్షల ఎకరాల పంట పొలాలు మునిగిపోయాయని...ప్రజలు, పశువులు కొట్టుకుపోయాయని తెలిపారు. ప్రభుత్వం కనీసం బాధితులకు నిత్యావసర సరుకులు ఇవ్వలేదని ఎమ్మెల్యే విమర్శించారు.


వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామని... వారి దుఃఖం వర్ణనాతీతమన్నారు. ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టం జరిగిన నేపథ్యంలో రైతులకు పరిహారం అందించాలని చెప్పామన్నారు. తానే ఇంజనీరింగ్‌గా కాళేశ్వరం నిర్మించాను అని ముఖ్యమంత్రి చెప్పారని.. ఇవాళ మంచిర్యాల పట్టణం మునిగిపోయిందని తెలిపారు. వేలాది ఎకరాల పంట పొలాలు మునిగిపోయాయన్నారు. ఈ ప్రాజెక్టు కట్టకముందు సుభిక్షంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. రైతు ఏడుస్తున్నాడు... సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. బీజేపీ శాసనసభ పక్షం తరపున కేంద్ర బృందాన్ని కలుస్తామన్నారు.ర ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని సంబుర పడుతున్నారని.. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునే కుట్ర జరుగుతోందని తెలుస్తోందన్నారు. మల్టిపర్పస్ అని చెప్పి ఊడ్చేవాళ్ళు కూడా ట్రాక్టర్ నడపాలని చిల్లర నిబంధనలు పెట్టారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-03T14:02:22+05:30 IST