Mynampalli Hanmanthrao: వారం తర్వాత మాట్లాడుతా.. మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతా..
ABN , First Publish Date - 2023-08-26T13:23:28+05:30 IST
బీఆర్ఎస్‌లో అణచివేతకు గురి అయ్యామని మెదక్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్‌లో (BRS) అణచివేతకు గురి అయ్యామని మెదక్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారని మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampalli Hanmanth rao) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు కోవిడ్ టైంలో రూ.8 కోట్లు పెట్టి ప్రజలకు సహాయం చేశారన్నారు. జీవితంలో సెటిల్ అనేది ఉండదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పోటీ చేసి ఓడానని.. ఓటమితో వెనుకాడే వ్యక్తిని కాదని చెప్పారు. ‘‘నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా.. రాజకీయాల కోసం మారే వ్యక్తిని కాదు.. నాకు రాజకీయ భిక్ష పెట్టింది మెదక్. ఎవరు నన్ను ఇబ్బంది పెడితే వారిని తిడతా. వ్యక్తిగతంగా నేను ఎవరిని తిట్టను. రేపటి నుంచి వారం రోజులు మల్కాజిగిరి ప్రజల్లో తిరుగుతా. వారం తర్వాత మీడియాను పిలిచి మాట్లాడతా. నిన్న నా శ్రేయోభలాషులు తొందర పడొద్దని చెప్పారు. మాట్లాడ వద్దని నాతో ఒట్టు తీసుకున్నారు. అందుకే వారం రోజులు ప్రజల మాండెట్ తీసుకుంటా. ప్రెస్‌మీట్ పెట్టి మీడియా అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. నా కొడుకు నా కంటే ఎక్కువ పని చేస్తున్నారు. ఆయన్ను ఎందుకు సెట్ చేయొద్దు. నన్ను తిట్టేవారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను పార్టీని ఏమనలేదు. నన్ను పార్టీ ఏమనలేదు. మెదక్ ప్రజలు ఏది చెబితే నా కొడుకు అది చేస్తారు. సొంత పార్టీ నేతల మీదనే కేసులు పెట్టారు’’ అంటూ మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలు చేశారు.