JaggaReddy: ‘నా జీవితం ముత్యాల ముగ్గు సినిమాలోని హీరోయిన్ బతుకే’
ABN , First Publish Date - 2023-02-10T15:18:38+05:30 IST
రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనదైన స్టైల్‌లో స్పందించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA JaggaReddy) తనదైన స్టైల్‌లో స్పందించారు. శుక్రవారం సీఎల్పీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ... పాదయాత్ర (Padayatra)లు ఎవరైనా చేసుకోవచ్చన్నారు. అసెంబ్లీ (Telangana Assembly) తర్వాత ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేస్తారన్నారు. ‘‘నన్ను ఇతర సెగ్మెంట్‌ల నేతలు పిలిస్తే.. వారి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తా.. నా జీవితం ముత్యాల ముగ్గు సినిమాలోని హీరోయిన్ బతుకే’’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఆ తేడా తెలుసుకోండి...
జగ్గారెడ్డి ఇంకా మాట్లాడుతూ... టెర్రరిస్టు విధానాలకు కాంగ్రెస్ (Congress)వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశ ప్రజల భద్రత కోసం తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఇంధిరా గాంధీ (Indira Gandhi) , రాజీవ్ గాంధీ (RajivGandhi) బలయ్యారన్నారు. నక్సలైట్లు కూడా ప్రజల కోసం చేసే పోరాటం చూసి.. జన జీవన స్రవంతిలో కలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపిందని గుర్తుచేశారు. సోనియా గాంధీ నేతృత్వంలో రాజశేఖర్ రెడ్డి ... నక్సలైట్లు (Naxalites) జనజీవన స్రవంతిలో కలిసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. చట్ట పరిధిలో ఉద్యమాలు చేయకపోవడం వల్లే నక్సలైట్లు అడవుల్లో ఉండి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. రాజకీయ నాయకులు, నక్సలైట్లు కూడా ప్రజల మంచి కోసమే పోరాడుతున్నారని అన్నారు. రాజకీయ నాయకులు (Politicians) చట్ట పరిధిలో పనిచేస్తున్నారన్నారు. నక్సలైట్లు చట్టం పరిధి దాటి పనిచేయడం వల్ల సమాజానికి దూరంగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయన్నారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ విధానాలను విమర్శించే వారు ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని జగ్గారెడ్డి హితవుపలికారు.