శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సీవీ ఆనంద్
ABN , First Publish Date - 2023-01-31T19:51:50+05:30 IST
శారదా విద్యాలయ (Sharada Vidyalaya) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ముఖ్య అతిథిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) హారజయ్యారు.
శారదా విద్యాలయలో క్రీడామైదానం ప్రారంభం
క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఐదు నెట్స్ ఏర్పాటు
హైదరాబాద్: శారదా విద్యాలయ (Sharada Vidyalaya) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ముఖ్య అతిథిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) హారజయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కతిక శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఐఏఎస్, గౌరవ అతిథిగా పాల్గొన్నారు. శారదా విద్యాలయ కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తోంది. ఈ వేడుకల్లో పాల్గొన్న విశిష్ట వ్యక్తులు.. ఈ విద్యాలయంతో తమకున్న అనుబంధాలను తెలుపుతూ విద్యార్థులలో స్ఫూర్తిని నింపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడా మైదానాన్ని సైతం ప్రారంభించారు. దీనితో పాటుగా క్రికెట్ అభిమానుల కోసం ఐదు నెట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటితో పాటుగా బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు, అథ్లెటిక్స్, స్పోర్ట్స్ ఏర్పాట్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథులుగా పూర్వ భారత క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెటర్ వెంకటపతి రాజు, ఏంజెల్ ఇన్వెస్టర్ మరియు నోహ్ సాఫ్ట్ వ్యవస్థాపకులు మైనేని పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్ ల్యాబ్స్ ఛైర్మన్ జయంత్ ఠాగోర్, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్ మాదిరెడ్డి, కరస్పాండెంట్ జ్యోత్స్న అంగారా సైతం పాల్గొన్నారు. నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో శారదా విద్యాలయ గ్రూప్‌ను 1922లో వై సత్యనారాయణ ఏర్పాటు చేశారు. ఈ విద్యాలయను అప్పటి హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రితో పాటుగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. అత్యంత పురాతనమైన, లాభాపేక్షలేని విద్యాలయంగా ఖ్యాతి గడించిన శారదా విద్యాలయలో కేజీ నుంచి పీజీ వరకూ విద్యాబోధన సాగుతుంది. దాదాపు 1450 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత బాలికల కోసమే దీనిని ప్రారంభించినా అనంతర కాలంలో బాలురకీ ఇక్కడ విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాసంస్థలో 62శాతం మంది బాలికలు ఉన్నారు. నిరుపేద చిన్నారులకు విద్యనందించడంలో అందిస్తున్న తోడ్పాటుకుగానూ 2018లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణా అవార్డునూ అందుకుంది.
అవిశ్రాంతంగా వందేళ్లగా మెరుగైన విద్యాబోధనను పాతబస్తీ విద్యార్థులకు చేస్తోన్న శారదా విద్యాలయ విప్లవాత్మక ఆవిష్కరణలనూ మెరుగైన విద్య కోసం చేసింది. డిజిటల్ తరగతులను నాల్గవ తరగతి లోపు విద్యార్ధులకు తీసుకురావడంతో పాటుగా 1.36 ఎకరాల విస్తీర్ణంలో ఆటస్థలాన్నీ విద్యార్ధులకు అందుబాటులో ఉంచి, ఫిజికల్ ఎడ్యుకేషన్‌కూ అమిత ప్రాధాన్యత అందిస్తుంది. తమ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా చేయడానికి శారదా విద్యాలయ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలలో భాగంగా వందేళ్ల విద్యాలయ ప్రస్ధానంలో కీలకమైలురాళ్లతో ఓ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు.