Congress Meeting: ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ.. కాసేపట్లో తెలంగాణ సీఎం అభ్యర్థిపై ప్రకటన..!
ABN , First Publish Date - 2023-12-05T13:41:26+05:30 IST
Telangana: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు మంగళవారం సమావేశమయ్యారు. ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో (AICC Chief Mallikarjuna Kharge) కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Karnataka Deputy Chief Minister DK Shivakumar), ఏఐసీసీ పరిశీలకులు మంగళవారం సమావేశమయ్యారు. ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కేసీ వేణుగోపాల్(KC Venugopal) తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే (Telangana in-charge Manik Rao Thackeray) పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఏకవాక్య తీర్మానాన్ని అధిష్ఠానానికి డీకే అందజేశారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ పర్యటనను ముగించుకుని డీకే శివకుమార్ తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సీనియర్లతో చర్చించిన అనంతరం అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థి పేరును హైదరాబాద్‌లో డీకే శివకుమార్ ప్రకటించనున్నారు.
అంతకుముందు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ నిర్ణయాన్ని అధిష్టానానికి చెప్పడం వరకే తన పని అని, పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు ఉంటుందని సీఎల్పీ తీర్మానం చేసిందని తెలిపారు. సీఎల్పీ అభిప్రాయానికి సంబంధించిన నివేదికను అందించడానికి ఢిల్లీ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తన బాధ్యత అంతవరకే అని అన్నారు. పార్టీ అధ్యక్షుడే తెలంగాణ ముఖ్యమంత్రి, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటారని డీకే శివకుమార్ వెల్లడించారు.