Hyderabad: పాపం.. హైదరాబాద్ హాస్టల్స్‌లో ఉండేవాళ్లకు ఈ విషయం తెలుసో.. లేదో..!
ABN , First Publish Date - 2023-06-13T15:51:19+05:30 IST
హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోటీ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో దొరికిన కాడికి దోచుకోవాలనే ధోరణితో నిరుపేద అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు.
ప్రైవేట్ హాస్టళ్ల దోపిడీ..!
నెలవారీ ఫీజును పెంచిన నిర్వాహకులు
ఒక్కొక్కరి నుంచి రూ.6 నుంచి రూ.8 వేలు వసూలు
పోటీ పరీక్షలు సమీపిస్తుండడంతో ఇష్టారాజ్యం
గతంలో రూ.4 వేలు మాత్రమే
పెరిగిన ఫీజుతో ఆందోళనలో నిరుపేద అభ్యర్థులు
నిర్వహణను పట్టించుకోని జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌సేప్టీ అధికారులు
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోటీ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో దొరికిన కాడికి దోచుకోవాలనే ధోరణితో నిరుపేద అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా అహోరాత్రులు శ్రమిస్తున్న సమయంలో ఆర్థిక సమస్యలు వేధిస్తుండడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గ్రూప్-1 పరీక్ష నిర్వహించగా, జూలై 1న గ్రూప్-4, ఆగస్టు 29,30 గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆయా పరీక్షలకు హాజరై ఉద్యోగాలు సాధించేందుకు నగరానికి వచ్చిన అభ్యర్థులకు ప్రస్తుతం హాస్టల్ ఫీజులు భారంగా మారాయి.
గ్రూప్స్ కోచింగ్‌తోపాటు హాస్టళ్లలో నెలవారీ అద్దె ఫీజును ఒక్కసారిగా పెంచడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఉదాహరణకు అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు రూ.1.80 లక్షలు తీసుకుంటున్నారు. మెయిన్స్‌కు రూ. 50 నుంచి రూ.55 వేలు వసూలు చేస్తున్నాయి. అలాగే గ్రూప్-2 రెండు నెలల శిక్షణకు రూ.33 వేలు, మరో సెంటర్‌లో గ్రూప్- 2కు రూ.19,500 తోపాటు రూ.3,510 జీఎస్‌టీని కూడా వసూలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. అయితే ఓ వైపు కోచింగ్ ఫీజును చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో హాస్టళ్ల నిర్వాహకులు సైతం సందట్లో సడేమియా అంటూ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచి వసూలు చేస్తుండడంతో సతమతమవుతున్నారు.
అశోక్‌నగర్, చిక్కడపల్లిలోని సాధారణ హాస్టళ్లలో గతంలో వసతితోపాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రివేళ భోజనానికి రూ.4వేలు తీసుకున్న నిర్వాహకులు.. ప్రస్తుతం రూ.6 నుంచి 8 వేలు తీసుకుంటున్నారు. ఒక గదిలో నలుగురు నుంచి ఐదుగురికి బెడ్ సౌకర్యం ఇస్తున్నా.. ఫీజు మాత్రం తగ్గించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఏసీ, అటాచ్డ్ బాత్‌రూమ్‌లు కలిగి ఇద్దరు, ముగ్గురు ఉన్న గదులకు ఒక్కొక్కరికి రూ. 15 నుంచి రూ.18 వేలు వసూలు చేస్తున్నారు.
కానరాని జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌సేప్టీ అధికారులు..
పోటీ పరీక్షల నేపథ్యంలో అశోక్‌నగర్, చిక్కడపల్లి, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్‌లోని హాస్టళ్లలో కొంతమంది నిర్వాహకులు దొడ్డుబియ్యం, నాసిరకం కూరగాయలతో భోజనం అందిస్తుండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. నెలకు వేలల్లో ఫీజులు తీసుకుంటున్నా నిర్వహణ సరిగా ఉండడం లేదని వాపోతున్నారు. నగరంలోని ప్రైవేట్ హాస్టళ్ల నిర్వహణ తీరును తనిఖీ చేసే జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఒక్కసారి కూడా వచ్చిన దాఖలాలు లేవని చెబుతున్నారు. దీంతో హాస్టల్ నిర్వాహకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకేసారి రూ.1500 పెంచారు
అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటున్నాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చి హాస్టల్‌లో ఉంటున్నాను. మే వరకు హాస్టల్ ఫీజు రూ.4,500 తీసుకున్న యజమాని ఈనెల నుంచి రూ.6వేలు చెల్లించాలని చెప్పారు. ఒకేసారి రూ.1500 ఎందుకు పెంచారని అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఇష్టముంటే ఉండు, లేకుంటే వెళ్లు అని చెబుతున్నారు. కోచింగ్ సెంటర్‌కు హాస్టల్ దగ్గరగా ఉండడంతో చేసేదేమి లేక ఇక్కడే ఉంటున్నాను. హాస్టల్ ఫీజు పెంచడంతో నాలాంటి పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
- సూర శ్రీనివాస్, హన్మకొండ